మద్దికెర: మేఘాలు తప్ప చినుకు రాలడం లేదు. పంటలు ఎండిపోతున్నాయని అల్లాడుతున్న అన్నదాతలకు జింకలు పొలాల్లో పడి పైర్లను నాశనం చేస్తూ ఇంకో సమస్యగా మారాయి. మండలంలోని మద్దికెర, ఎం.అగ్రహారం, పెరవలి, హంప, ఎడవలి తదితర గ్రామాల్లో పంటలకు జింకల బెడద ఎక్కువైందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల సకాలంలో వానలు కురవకపోవడంతో, పడిన అరకొర వర్షాలకే వ్యయ ప్రయాసలకోర్చి కంది, పత్తి, ఆముదం, వేరుశనగ పంటలను లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేశారు. రోజూ పొలాల్లోకి వస్తున్న జింకల నుంచి పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో పంటలు వాడుముఖం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రోజు కూలి ఇచ్చి పంటలకు వ్యక్తులను కాపలా ఉంచుతున్నామని, అయినా జింకలు పడి నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా జింకల బెడద నుంచి పైర్లను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.


