కరుగుతున్న కొండ | - | Sakshi
Sakshi News home page

కరుగుతున్న కొండ

Jul 30 2026 4:42 AM | Updated on Jul 30 2026 4:42 AM

● యథేచ్ఛగా టీడీపీ నేతల అక్రమ మైనింగ్‌ ● కనుమరుగవనున్న వెల్దుర్తి వీరన్న గట్టు కొండ ● పట్టణానికి, చెరువుకు, ఆయకట్టుకు ముప్పు

● యథేచ్ఛగా టీడీపీ నేతల అక్రమ మైనింగ్‌ ● కనుమరుగవనున్న వెల్దుర్తి వీరన్న గట్టు కొండ ● పట్టణానికి, చెరువుకు, ఆయకట్టుకు ముప్పు

వెల్దుర్తి: వెల్దుర్తి వీరన్నగట్టు కొండ కనుమరుగవుతోంది. అటవీ శాఖ పరిధిలోని వీరన్న గట్టు చెరువు పట్టణానికి, ఆయకట్టు పొలాలకు మధ్యలో కొండంత అండగా ఉంది. రెవెన్యూ శాఖ పరిధిలోని వీరన్న గట్టు కొండ ఎన్నో ఏళ్లుగా ఎలాంటి వైపరీత్యాలకై నా నేనున్నానని అండగా నిలబడి ఉండేది. ప్రస్తుతం కొందరు దురాక్రమణదారుల దెబ్బకు కరిగిపోతోంది. గత తెలుగుదేశం పాలనలో, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు కొండను తవ్వి లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించారు. దీంతో ఈ కొండపై వెలసిన శివాలయం, దర్గా, శిలువ ప్రాంతాలను చేరుకునేందుకు అక్రమార్కులకు ఇంకా ఎంతో కాలం పట్టకపోవచ్చు. అక్రమ మైనింగ్‌తో వారికి లాభాల పంట పండొచ్చు గానీ వెల్దుర్తి పట్టణం వరద ముంపునకు, ఆనుకుని ఉన్న చెరువు గండికి, ఆయకట్టు కనుమరుగుకు అవకాశాలున్నాయి. ఊరెలా పోతే మాకేమి అన్న రీతిలో పాలకులు, నాయకులు వివిధ పథకాల రోడ్డు పనులకు, ప్రభుత్వ పనులకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు వీరన్నగట్టు కొండ ప్రాంతం నుంచి అక్రమంగా గ్రావెల్‌ను యంత్రాలతో తోడుతూ తరలించడం అలవాటు చేసుకున్నారు. గమనించాల్సిన రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకున్నారు. గతంలోనే ఈ ప్రాంతంలో ఐరన్‌ ఓర్‌ అక్రమ మైనింగ్‌ జరిగి కొండ ప్రాంతం కొంత కరిగిపోయింది. కొందరు నాయకులు ఈ ప్రాంతంలో ప్రభుత్వం నుంచి భూమిని పొంది తమ అనుయాయులకు ఇళ్ల నిర్మాణాలకు పట్టాలిప్పిస్తామని అమ్ముకున్నారు. ఆక్రమణలతోనే ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకొందరు ఈ కొండ ప్రాంతంలో భూమిని దున్నుకుని పంటలు పండించే నెపంతో గ్రావెల్‌ తవ్వుకుని అమ్ముకుంటున్నారు. వీటన్నిటి ఫలితంగా రాబోవు రోజుల్లో ఈ కొండ కరిగిపోయి ఇటు వెల్దుర్తి ప్రజలకు వరదల ముప్పుతోపాటు, అటు వీరన్న గట్టు చెరువుకు గండ్లు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా చెరువు సమీపంలోని రైల్వే లైనుకు ముప్పు తప్పదు. కొండపైన, కింద వెలసిన వివిధ మతాల గుళ్లు, దర్గాలు సైతం కనుమరుగయ్యే అవకాశం ఉంది. విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టనట్టు ఉంటుండడంతో అక్రమ మైనింగ్‌ దారులకు వీరన్న గట్టు ప్రాంతం వరమైంది. ఇప్పటికై నా అధికారులు భావి తరాల ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వీరన్నగట్టు కొండ నుంచి గ్రావెల్‌, ఎలాంటి ఖనిజాలు తరలించకుండా, తవ్వకాలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొండ చుట్టూ ఫెన్సింగ్‌, పైకి దారి, చెట్ల పెంపకంతో అభివృద్ధి చేసి భూ సమతుల్యతను, ప్రకృతి వనరులను, పట్టణాన్ని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement