కర్నూలు సిటీ: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రుఖియా బీ భర్త మహబూబ్ బాషా (48) బుధవారం ఉదయం తన స్వగృహంలో ఫ్యాన్‌కు పంచతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల గ్రామానికి చెందిన మహబూబ్ బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. గత ప్రభుత్వంలో మైనార్టీ కోటా కింద కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఆయన భార్యకు వరించింది. అలాగే మహబూబ్ బాషా డైరెక్టర్‌గా పని చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొదట్లో బాగానే సంపాదించారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో రెండు, మూడు చోట్ల వెంచర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పుల భారం పెరిగిపోయింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి తిరిగి చెల్లించాలని ఒత్తిళ్లు పెరగడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఉన్న రెండు కార్లను అప్పులు ఇచ్చిన వారు తీసుకెళ్లిపోయారు. ఇటీవలే ఓ వ్యక్తికి ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి ఒత్తిడి చేయడంతో బుధవారం డబ్బులు చెల్లిస్తానని పంచాయితీ చేసుకున్నారు. అయితే డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. పసుపుల గ్రామంలోని తన ఇంట్లో ఉదయం టిఫిన్ చేసి పైఅంతస్తులోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నారు. కొద్ది సమయం తరువాత భార్య వెళ్లగా భర్త ఉరేసుకుని ఉండటాన్ని చూసి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వచ్చి కిందకుదించారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
పసుపుల మహబూబ్ బాషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, కూడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.


