● మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగు మందు తాగిన కుటుంబం
పాములపాడు: మైక్రో ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక భార్య, భర్త, ఇద్దరు పిల్లలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. బుధవారం ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 28న రాత్రి నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన వడ్డె రామసుబ్బడు, భార్య మాధవి, 9వ తరగతి చదువుతున్న కూతురు జయతేజ, 7వ తరగతి చదువుతున్న అక్షయతో కలిసి మండలంలోని యర్రగూడూరు గ్రామంలో ఎల్లమ్మ ఆలయం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కర్నూలుకు వెళ్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
బండి లాక్కెళ్లారు – జీవనం కష్టంగా మారింది
ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఒడ్డె రామసుబ్బడు బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నా డు. ఫైనాన్స్ కంపెనీ వారికి 2 కంతులు బకాయి ఉండటంతో ఇటీవల వాహనాన్ని లాక్కెళ్లారు. అప్పటి నుంచి కుటుంబ జీవనాధారం కోల్పోయినట్‌లైంది. అప్పుల బాధ ఎక్కువైంది. ఫైనాన్స్ కంపెనీ వారి వేధింపులు ఎక్కువకావడం, అవమాన భారంతో మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబంతో సహా తనువు చాలించాలని నిర్ణయించుకొని నందికొట్కూరులో పురుగు మందు కొని తీసుకున్నారు. పాములపాడు మండలంలోని యర్రగూడూరు గ్రామం వద్దకు వచ్చి గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు బంధువులు తెలిపారు.


