‘తల్లికి వందనం’ నగదు కాజేసిన ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

‘తల్లికి వందనం’ నగదు కాజేసిన ఇద్దరి అరెస్ట్‌

Jul 30 2026 4:42 AM | Updated on Jul 30 2026 4:42 AM

కర్నూలు: తల్లికి వందనం పథకం నగదును ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఇద్దరిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. కర్నూలు గడ్డా వీధి నివాసి షేక్‌ ముంతాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మోసానికి పాల్పడిన చిత్తారి వీధిలో నివాసముంటున్న నూకల ఉపేంద్ర, ఎయిర్‌టెల్‌ కంపెనీ ఉద్యోగి వీరారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉచితంగా ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డులు ఇస్తామని చెప్పి లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు, ఐరిష్‌ స్కాన్‌, ఆధార్‌ వివరాలు సేకరించారు. తర్వాత లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేరుతో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డు తీసుకుని ‘తల్లికి వందనం’ పథకం సొమ్మును స్వాహా చేశారు. సీఐలు మారుతి శంకర్‌, పూల రామకృష్ణ, ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి (సైబర్‌ సెల్‌ సీఐ), వారి సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కేసును 24 గంటల్లో ఛేదించారు. గడ్డా వీధి అలీషేర్‌ బాగ్‌, చిత్తారి వీధి, ఖడక్‌పుర ప్రాంతాలకు చెందిన దాదాపు 10 మంది మహిళలను ఇదే తరహాలో మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. వారి ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంకు లావాదేవీల వివరాలను పోలీసులు సేకరించారు. నగరంలోని వివిధ ఏటీఎం సెంటర్ల నుంచి రూ.5.80 లక్షలను నిందితులు విత్‌డ్రా చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 105 ఏటీఎం కార్డులు, రెండు సెల్‌ఫోన్లు, బయోమెట్రిక్‌ ఫింగర్‌ప్రింట్‌ డివైజ్‌తో పాటు రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement