పాములపాడు: పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీ రాణెమ్మ (45) వ్యవసాయ బావిలో కాలు జారి పడి మృతి చెందింది. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చెలిమిల్ల గ్రామంలో ఇద్దరు మహిళా కూలీలు మొక్కజొన్న పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. విరామ సమయంలో రాణెమ్మ దిగుడు బావిలో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లి జారీ నీటిలో పడిపోయింది. అక్కడే ఉన్న మరో మహిళ వెంటనే కేకలు వేయడంతో చుట్టు పక్కల పొలాల్లో ఉన్న యువకులు బావిలో దూకి నీట మునిగిన రాణెమ్మను బయటకు తీశారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలికి భార్య ఏసు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


