● రస్తా స్థలంపై వివాదం
పాములపాడు: భానుముక్కల గ్రామంలో హిందూ శ్మశాన వాటిక నుంచి క్రతువుకు వెళ్లే రహదారి విషయంలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సుమారు 20 రోజులుగా ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు వర్గాలు రెవెన్యూ, పోలీసు అధికారులను ఆశ్రయించారు. ఇటీవల జరిగిన రీసర్వేలో మిగులు భూమిగా ఉన్న దాతలిచ్చిన 0.42 సెంట్ల స్థలం తమదే అన్నట్లుగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రికార్డులో పొందుపర్చి, ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఈ నెల 17న సమస్య అధికారుల వద్ద ఉండగానే గుట్టు చప్పుడు కాకుండా శివుడు తన కుమారుడు శంకర్ పేరిట దాన విక్రయంగా రిజిస్టర్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏకమై సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ సుభద్రమ్మ, ఎస్‌ఐ తిరుపాలు గ్రామానికి చేరుకొని ప్రజలకు విషయాన్ని వివరిస్తూ సర్దుకునేలా చెప్పారు. కాగా ప్రజల్లో ఒకరికి ఒకరికి మాట పెరిగి ఉద్రిక్తంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే ప్రజలనందరిని అక్కడి నుంచి పంపించేశారు.


