ఆస్పరి: మండలంలోని ములుగుందం గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సోమవారం ఆ గ్రామ సమీపంలో ఉన్న పత్తి పొలంలో పడుకొని ఉన్న చిరుతను గమనించి రైతులు, కూలీలు భయాందోళనకు గురై ఇంటికి వచ్చారు. కొందరు చిరుత సంచారం వీడియోలు తీశారు. రెండేళ్ల నుంచి ములుగుందం కొండల్లో, పొలాల్లో చిరుత సంచరిస్తుందని, గత ఏడాది మేకలు, గొర్రెలను చంపిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈవిషయాన్ని అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే మూడు నెలలు క్రితం అట్టెకల్లు గ్రామ సమీపంలో చిరుతు ఆర్‌అండ్‌బీ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. చెరువుల్లో నీరు తాగేందుకు అటు, ఇటు తిరుగుతున్న సమయాల్లో చిరుతలు ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని బంధించి తీసుకెళ్లాలని స్థానికులు అటవీ అధికారులకు కోరుతున్నారు.


