ఇదీ లెక్క...
తుంగభద్ర కన్నీటి సంద్రమవుతోంది. నిలువెల్లా గాయాలతో మౌనంగా రోదిస్తోంది. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు పగబట్టి తాగునీటికీ దిక్కులు చూసే దుస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు ధనార్జనే ధ్యేయంగా రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా నిత్యం 300 పైగా ట్రాక్టర్లతో నదిలోని ఇసుకను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న నేత పేరు చెప్పుకొని తాను దగ్గరి బంధువని ఓ చోటానేత చేస్తున్న దందా లక్షలాది రూపాయల్లో ఉంటోంది. కళ్లెదుటే జరుగుతున్న బాగోతమైనా రెవెన్యూ, పోలీసులు అధికారులు చర్యలు తీసుకోని పరిస్థితి. అధికారుల స్థాయిని బట్టి చేతులు తడుపుతుండటంతోనే మౌనం వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలుకు కూతవేటు దూరంలోని పడిదెంపాడు–పూడూరు మధ్య తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకపోయినా పొక్లెయిన్లతో వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. రేయింబవళ్లు సాగుతున్న ఈ దందాను చూస్తే ప్రకృతిపై ఏ స్థాయిలో పగబట్టారో అర్థమవుతోంది.
– డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
ఒక ట్రాక్టర్ ఇసుక ధర: రూ.4వేలు
ప్రతిరోజూ తరలిస్తున్న
ట్రాక్టర్ల సంఖ్య: 300 పైనే
రోజుకు టీడీపీ నేతల జేబుల్లోకి
వెళ్తున్న డబ్బు: రూ.12లక్షలు
నెల రోజుల్లో అక్రమార్జన:
రూ.3.60కోట్లు


