● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
కర్నూలు: నా కుమార్తెకు అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని నా అల్లుడి ద్వారా పరిచయమైన పాములపాడు మండలానికి చెందిన సాయినూరు దేవకుమార్ కర్నూలులో రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని అలంపూర్ తాలూకా రాజోలి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్క నున్న క్యాంప్ కార్యాలయంలో విక్రాంత్ పాటిల్ సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ వినతులను స్వీకరించి మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 100 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలి తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.


