● భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు
చర్యలు చేపట్టాలి
● ప్రజానాట్య మండలి 11వ
రాష్ట్ర మహాసభల్లో తీర్మానం
కర్నూలు(సెంట్రల్): సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ డిమాండ్ చేశారు. ప్రజా నాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం సన్యాసిరావు – పెంచలయ్య నగర్‌లో రెండో రోజు వివిధ రకాల కళారూపాల వివరాల నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జిల్లాల ప్రతినిధులు, కార్యదర్శి నివేదికపై చర్చల్లో పాల్గొన్నారు. అంతేగాక సభలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు,
భావవ్యక్తీకరణకు భంగం
ఈ సందర్భంగా కట్టా నరసింహ మాట్లాడుతూ..1991 తరువాత ప్రపంచీకరణ నేపథ్యంలో కళలు కూడా బడా కార్పొరేటర్లకు అనుకూలంగా మారిపోయాయన్నారు. ప్రజా కళలు, కళాకారులకు ప్రోత్సాహం తగ్గిపోయిందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు, భావవ్యక్తీకరణకు భంగం కలిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాలు, ప్రజా కళలు వర్ధిల్లాల్సిన పరిస్థిలి నెలకొందన్నారు. శ్రమజీవులు, గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ప్రజానాట్య మండలిపై, ప్రజా సాంస్కృతిక ఉద్యమంపై బరువు, బాధ్యతలు పెరిగాయన్నారు.
సామాజిక సేవకులపై దాడులు
కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందరాపుమురళీ, గొర్రెలు మేకల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంట్రావు, జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంగారు మురళీ మాట్లాడుతూ.. ప్రజా కళలు వర్ధిల్లాలని, ప్రజా పోరాటాలను ఉద్ధృతం కావాలన్నారు. ప్రజల హక్కులను ప్రజా కళాకారులను కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ మధ్యకాలంలో అనేకమంది మేధావులు, కళాకారులు, పౌర హక్కుల నేతలు, సామాజిక సేవకులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో అందరూ ఐక్యమై ప్రజా కళలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత పెరిగిందన్నారు.
గురజాడ సాంస్కృతిక
విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి
సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలనే తీర్మానాన్ని పెద్దిరాజు ప్రవేశపెట్టగా రాఘవయ్య బలపరిచారు. గురజాడ సాంస్కృతిక విశ్వ విద్యాలయం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు జానపద, నాటక, ప్రజా కళారూపాలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. తెలుగు మాధ్యమ విద్యను బలోపేతం చేయాలని, కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి అనే తీర్మానాన్ని ఎంచంటి ప్రవేశపెట్టగా నోమేశ్వరి బలపరచారు. ఇందులో ప్రధానంగా భావ ప్రకటనా స్వచ్ఛా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొంటూ రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రెండు తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.మంగరాజు, ఉపాధ్యక్షులు జి.రమణ, సహాయ కార్యదర్శులు ఈ నాగరాజు, ఐవెంకటేశ్వర్లు, రిసోర్స్‌పర్సన్‌లు కవి పీఎన్‌ఎం సీనియర్ నాయకులు జగన్, కర్నూలు జిల్లా అధ్యక్షులు నోమేశ్వరి పాల్గొన్నారు.


