మహానంది: ఆషాఢమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో గురువారం వార్షిక ఆలయ శుద్ధి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, హనుమంతుశర్మ, నాగేశ్వరశర్మ, అర్చకులు రాముశర్మ, హరిశర్మ, ధర్మతేజ ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టారు. ముందుగా గణపతిపూజ, ద్రవ్యపూజలు శాస్త్రోక్తంగా జరిపారు. జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, వట్టివేళ్లు, లాంటి సుగంధ ద్రవ్యాలతో మిశ్రమ జలాన్ని తయారు చేసి సంకల్ప పూజలు జరిపిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి, రామాలయం, ఆంజనేయస్వామి, నవగ్రహ ఆలయం, వినాయకనంది, పాండవులు ప్రతిష్టించిన పంచలింగాల ఆలయాల గోపురాలను పరిశుభ్రం చేశారు. వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ.. ఆలయ శుద్ధి కార్యక్రమం వెనుక ఆధ్యాత్మిక, ఆగమపరమైన వాటితో పాటు ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయన్నారు. ఏడాది పొడవునా భక్తులు వస్తుండటం, ఆరోగ్యానికి హాని చేసే క్రిమి కీటకాలు లాంటివి ఉండకుండా చేస్తారని, ద్రవిడ బాషలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారన్నారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


