కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నక్కి లెననిబాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు పూనుకోవడం అన్యాయమన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఏఐటీయూసీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకుంటోందన్నారు. విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్‌కు అప్పగించేందుకు చూస్తుందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నాయకులు జి.చంద్రశేఖర్, ఈశ్వర్, కృష్ణారెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలతో ఖర్చులు తడిసి మోపైడె ప్రజలపై భారం పడడం తప్పా.. ఒరిగిందేమీ లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ విమర్శించారు. నెల రోజుల్లో నాలుగోసారి ఉమ్మడి జిల్లాకు వస్తున్నా ఒక్క పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుకు పైసా విదల్చలేదన్నారు. గురువారం సుందరయ్య భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. వెంటనే గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్, పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఎమ్మిగనూరులో చేనేత క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు లేక రైతులు పంటలు విత్తుకోలేదని, వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ, జి.రామకృష్ణ, ఎండీ ఆనంద్‌బాబు పాల్గొన్నారు.


