మరో నాలుగు రోజులు వర్షాలు | - | Sakshi
Sakshi News home page

మరో నాలుగు రోజులు వర్షాలు

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

‘నీట్‌’ లీకేజీ నిందితులను శిక్షించాలి చౌళ పంటను గొర్రెలకు వదిలేసిన రైతు

ఎమ్మిగనూరు సెంట్రల్‌: జిల్లాలో మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాఘవేంద్రచౌదరి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం, ఆదివారం రోజుల్లో తేలికపాటి వర్షాలు, శుక్రవారం, శనివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 5నుంచి 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చన్నారు.

క్వింటా వేరుశనగ రూ.8,089

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.8,089 పలికింది. మార్కెట్‌కు 808 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.3,132, మధ్యస్థం రూ.6,400.. గరిష్ట ధర రూ.8,089 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.

మాజీ మంత్రి అరెస్ట్‌ అక్రమం

వైఎస్సార్‌సీపీ బెస్త విభాగం రాష్ట్ర

అధ్యక్షుడు తెలుగు అనిల్‌ కుమార్‌

కర్నూలు(టౌన్‌): మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ బెస్త విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోందన్నారు. ఈనెల 11న కాశీబుగ్గ పాత హైవేపై ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో దానయ్య అనే గొర్రెల వ్యాపారి ఘటన స్థలంలోనే మృతిచెందాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారని, ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీ ఒప్పందం చేసుకున్నట్లు పత్రికల్లో కూడా వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అరెస్ట్‌ చేశారన్నారు. మత్స్యకార ప్రజాప్రతినిధులు మోపిదేవి వెంకటరమణ రావు, కొల్లు రవీంద్ర ఇప్పుడు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజులపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. మత్స్యకారుల ప్రజాప్రతినిధులతో రాజకీయ చదరంగం ఆటను వెంటనే విరమించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

కర్నూలు(హాస్పిటల్‌): నీట్‌ పరీక్ష పత్రం లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (జుడా) నాయకులు డాక్టర్‌ నిశాంత్‌ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రతి నీట్‌ అభ్యర్థికి ఏపీ జుడా అండగా నిలుస్తుందని, పరీక్షా వ్యవస్థలో న్యాయం, యోగ్యత, పారదర్శకతకు మద్దతు ఇస్తుందన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలపై నిష్పాక్షికమైన, సమగ్రమైన విచారణ జరపాలని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్ష ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, సమగ్రతను నిర్దారించే అర్ధవంతమైన సంస్కరణల కోసం కృషి చేయాలన్నారు.

కోడుమూరు రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వానలు కురవకపోవడంతో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో మూగ జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన రైతు ఖాజామోదీన్‌ ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని రూ.4 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి చౌళకాయ పంట సాగు చేశాడు. వానల్లేక చౌళకాయ పంట సరిగా ఎదగలేదు. పైగా వానల్లేక చౌళకాయ పంటకు వైరస్‌ సోకింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక బుధవారం సాయంత్రం చౌళకాయ పంటను గొర్రెలకు మేతగా వదిలేశాడు. వానల్లేక చౌళకాయ సాగుతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతు ఖాజామోదీన్‌ వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement