ఆదోని: ట్రాఫిక్ పోలీసులు అంటే వారు విధించే చలాన్లే అందరికీ కనపడతాయి. కానీ ఖాకీ అంటే క్రమశిక్షణ, కఠినత్వం మాత్రమే కాదు.. మానవత్వం, దయ, సేవాభావానికి కూడా ప్రతీక అని ఆదోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎస్.మహ్మద్ అలీ ఆజాద్ నిరూపిస్తున్నారు. తన వృత్తి బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల పాఠశాలకు చెప్పులు లేకుండా వెళ్తున్న పలువురు బాలికలను ట్రాఫిక్‌లో గమనించిన ఆజాద్ చలించిపోయారు. వారి వివరాలు తెలుసుకుని సొంత ఖర్చుతో 60 మంది బాలికలకు చెప్పులు కొనిపెట్టారు. దీంతో ఆ చిన్నారులు ఆనందం వ్యక్తం చేయగా, తల్లిదండ్రులు ఆయన సేవా మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతటితో ఆగకుండా మండుటెండలో రోడ్ల పక్కన పండ్లు, పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధులకు గొడుగులు అందించి వారికి ఉపశమనం కల్పించడం.. అలాగే అనాథ శవాలకు ఎవరూ ముందుకు రాని సందర్భాల్లో స్వయంగా బాధ్యత తీసుకుని సొంత ఖర్చుతో అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. ఇలా ఎలాంటి ప్రచారం ఆశించకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న కానిస్టేబుల్ ఆజాద్‌పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఖాకీకి కూడా కరుణ ఉంటుంది.. మానవత్వం ఉంటుందనే విషయాన్ని అజాద్ తన సేవల ద్వారా నిరూపించారని పలువురు కొనియాడుతున్నారు.


