● నిరుద్యోగ భృతి అందక యువకుల ఆందోళన ● ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది నిరుద్యోగులు
గడివేముల: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించి యువతను దగా చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఎన్నో హామీలు గుప్పించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నట్లు కాకి లెక్కలు చూపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో వీరి సంఖ్య 10 లక్షల మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, తదితర పెద్ద పెద్ద చదువులు చదివిన యువకులు ప్రైవేట్ రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబ పరిస్థితులు బాగా లేక వందలాది మంది నిరుద్యోగులు కూలి పనులు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో కూడా ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. రెండు వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడం విచారకరం.


