20న బసవేశ్వర విగ్రహ ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

20న బసవేశ్వర విగ్రహ ప్రతిష్ట

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

హొళగుంద: వీరశైవ లింగాయత్‌ల ఆరాధ్య దైవం శ్రీ బసవేశ్వరస్వామి విగ్రహానికి ఈ నెల 20న బసవ జయంతి రోజున ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. కొల్లాపురం నుంచి వచ్చిన విగ్రహాన్ని వీరశైవ లింగాయత్‌లు హొళగుంద పురవీధుల గుండా భజన చేస్తూ ఊరిగించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ప్రతిష్టాపన కట్టపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 20న కర్ణాటకకు చెందిన గురువుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఉపాధ్యాయులు రూ.65 వేలు విరాళంగా అందజేశారు.

ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం

హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో నీటి ప్రవాహం తగ్గింది. టీబీ డ్యాం నుంచి పవర్‌ కెనాల్‌ (ఎల్లెల్సీ)కు 1,805 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆంధ్ర వాటా కింద దాదాపు 700 క్యూసెక్కుల నీరు అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీరు వరకు ప్రవహిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగేవాడి, కూరిగనూరు, సూగూరు, గుండ్లకెరే, కరూరు, కరుగోడు, మోకా తదితర ప్రాంతాల్లో ఈ నీటిని వాగులు, వంకలు, చెరువులకు, పొలాల్లో పైర్లకు తరలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాగునీటి అవసరాల కోసం ఈ నెల 3న ఎల్లెల్సీకి నీటిని విడుదల చేశారు. ఈ నెల 18 లేదంటే 20వ తేదీన బంద్‌ చేసే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఆమె వివరించారు.

14న అంబేడ్కర్‌ జయంతి

కర్నూలు(అర్బన్‌): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు పాత బస్టాండ్‌ సమీపంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి 14వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. అనంతరం అక్కడే జయంతి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, డీవీఎంసీ సభ్యులు, ఆయా కుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు, మహిళలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఆమె కోరారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్‌మెంట్లలో తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement