యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న టీడీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న టీడీపీ నేతలు

Feb 16 2026 7:50 AM | Updated on Feb 16 2026 7:50 AM

యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న టీడీపీ నేతలు

యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న టీడీపీ నేతలు

కోవెలకుంట్ల: రైతులకు అందాల్సిన యూరియా బస్తాలను టీడీపీ నేతలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పబ్లిక్‌ వింగ్‌ అధ్యక్షుడు, పార్టీ పొట్టిపాడు గ్రామ పరిశీలకుడు భోగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గ్రీవెన్‌సెల్‌ విభాగ అధ్యక్షుడు చిక్కేపల్లి ప్రసాదరెడ్డి ఆరోపించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కోవెలకుంట్ల మండలం వెలగటూరు సొసైటీకి సరఫరా చేస్తున్న యూరియా పంపిణీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సొసైటీ పరిధిలోని కోవెలకుంట్ల, అమడాల, సౌదరదిన్నె, పొట్టిపాడు, జోళదరాశి, గుంజలపాడు, బిజనవేముల, వెలగటూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు సొసైటీని తమ గుప్పెట్లో పెట్టుకుని యూరియాను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం బస్తాకు రూ. 270 ధర నిర్ణయించగా టీడీపీ నాయకులు బస్తాను రూ. 400 ప్రకారం ఇతర మండలాలు, నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులకు అమ్ముతున్నారన్నారు. బస్తాపై రూ. 130 అదనంగా వసూలు చేస్తూ వందలాది బస్తాల యూరియాను ఇక్కడి నుంచి తరలిస్తున్నారని పేర్కొన్నారు. సొసైటీకి వచ్చే యూరియాను తమకు తెలియకుండా ఎవరికీ ఒక్క బస్తా కూడా ఇవ్వవద్దని అధికారులకు హుకూం జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకెళితే యూరియా స్టాక్‌ లేదని వెనక్కు పంపుతున్నారని, మరి కొందరి రైతులపై వైఎస్సాసీపీ ముద్ర వేసి యూరియా ఇవ్వకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు పార్టీలతో ఏమి సంబంధం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో యూరియా పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ నుంచి బహిరంగంగా యూరియా పక్క మండలాలకు తరలివెళుతున్నా అధికారులు చోద్యం చేస్తున్నారన్నారు. సొసైటీలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసి రైతులకు యూరియా అందేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెలగటూరు మాజీ సర్పంచ్‌ మాధవరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement