మిరప పంటను అమ్మడానికి వెళ్లి..
● రోడ్డు ప్రమాదంలో ఒక రైతు మృతి
● మరొక రైతు పరిస్థితి విషమం
● బంటకుంటలో విషాదఛాయలు
కౌతాళం: తాము పండించిన మిరప పంటను కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు బొలెరోలో తీసుకుపోతుండగా వాహనం టైరు పేలడంతో ఒక రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో రైతు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కౌతాళం మండలం బంటకుంట గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు కలిసి తాము పండించిన మిరప పంటను అమ్ముకోవడానికి బ్యాడిగి మార్కెట్‌కు బొలెరోవాహనంలో వెళ్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గా వద్ద ముందు టైరు పేలడంతో వాహనం ఒక్కసారిగా బోల్తాపడింది. వాహనంలోని కురవ వీరనాగ (30) అక్కడికక్కడే మృతి చెందగా చాకలి ఈరన్న తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. మరో రైతు గోవర్ధన్ కాలు విరిగింది. తరసాలప్ప, వెంకటేష్, డ్రైవర్ ముల్లారు బుడ్డ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదే వాహనంలో ఉన్న మృతుడు వీరనాగ అన్న తరసాలప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతునికి భార్య హైమావతి ఉంది.
ఎమ్మెల్యే పరామర్శ
కురవ వీరనాగ మృతిపై మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఫోన్‌లో వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. గాయపడిన రైతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంఘటన అత్యంత బాధాకరం అన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ప్రహ్లాదచారి తన సంతాపాన్ని తెలిపారు.


