గదుల కొరత.. అరకొర సౌకర్యాలు
● శ్రీశైలంలో భక్తులకు తప్పని ఇబ్బందులు
ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించే పాగాలంకరణను చూసేందుకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివచ్చారు. వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. భక్తులకు కావాల్సిన గదులు కేటాయించలేకపోయారు. ప్రైవేట్ సత్రాల్లో ఒక గది రూ.800 నుంచి రూ.1500 ఉండగా, రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పైగానే భక్తులు చెల్లిస్తున్నారు. గదుల కొరతను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యక్తులు దీనిని వ్యాపారంగా చేసుకుంటున్నారు. గదులు లేవని, గదులు కావాలంటే రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లిస్తేనే గదులు ఉంటాయని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సత్రాల వద్ద గదుల తాళం ఇస్తున్నారు. గదుల రశీదులను ఇవ్వడంలో తిరిగి ఖాళీ చేసే సమయంలో తిరిగి తాళం వారికే ఇవ్వడంతో రశీదులు కూడా ఉండకపోవడంతో ఇక్కడ కొందరు వ్యక్తులు ఎంత అడిగితే అంత దోచుకుంటున్నారు. భారీగా డబ్బు వెచ్చించలేక భక్తులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడే నిద్రిస్తున్నారు.
తాగునీరు లేక ఇబ్బందులు
శ్రీశైలం దేవాలయ పరిధిలో శివారు ప్రాంతాల్లోని కొన్ని సత్రాలు, గృహాల వద్ద మంచినీరు, స్నానపు నీరు లేకపోవడంతో శ్రీశైలంకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లీటర్ తాగే నీరు రూ.40, సీసా వాటర్ బాటిల్ అయితే రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా అధికారులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆదేశాలు ఉన్నా పాటించడం లేదు.


