హాజరు భద్రం.. బ్లాక్ టీచింగ్ శూన్యం!
● నేటి నుంచి మరో సారి బ్లాక్ టీచింగ్
కర్నూలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. ఉన్నత విద్య మండలి నియంత్రణ లేకపోడవంతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కోర్సు అభ్యసిస్తున్న ఛాత్రోపాధ్యాయులు బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)కు వెళ్లడం లేదు. అయితే హాజరైనట్లు గత కొన్నేళ్లుగా నివేదికలను వర్సిటీకి నివేదిస్తున్నారు. విచారణలో ఈ విషయం తేలడంలో నేటి నుంచి మరోసారి థర్ట్ సెమిస్టర్ బ్లాక్ టీచింగ్ చేయించేందుకు ఆర్‌యూ బోర్డు ఆఫ్ స్టడీస్ షెడ్యుల్ జారీ చేసింది.
విచారణ నివేదిక ఏం చెప్పిందంటే...
2024–26 బ్యాచ్‌కి చెందిన బీఈడీ విద్యార్థులు థర్డ్ సెమిస్టర్ బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)చేసుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు గతేడాది అక్టోబరు 1న దరఖాస్తు చేసుకున్నాయి. మొత్తం 25 కాలేజీలకు 74 ప్రభుత్వ/జడ్పీ యాజమాన్యాల స్కూళ్లలో ఇంటర్న్‌షిప్‌కు అనుమతులు ఇచ్చారు. అదే నెల 3నుంచి నవంబరు 1వ తేదీ వరకు ఇంటర్న్‌షిప్ చేసుకోవాలని డీఈఓ ప్రోసిడింగ్స్ ఇచ్చారు. అయితే రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఎవరు కూడా ఇంటర్న్‌షిప్‌కు హాజరు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ విచారణ చేయగా మూడు కాలేజీలకు చెందిన వారు మాత్రమే హాజరయ్యారని తేదింది. మిగతా కాలేజీ విద్యార్థులు హాజరు కాలేదని ఆర్‌యూ రిజిస్ట్రార్ బి.విజయ్‌కుమార్ నాయుడుకు గతేడాది నవంబరులో నివేదిక అందజేశారు. ఈ నివేదికు మార్చేందుకు అప్పటి నుంచి నెల రోజులకుపైగా ఆర్‌యూ అధికారులతో పాటు బీఈడీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ ముసుగులో ఉన్న వారు ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఎట్టకేలకు మరోసారి థర్ట్ సెమిస్టర్ బ్లాక్ టీచింగ్ చేయించేందుకు ఆర్‌యూ బోర్డు ఆఫ్ స్టడీస్ షెడ్యూల్ జారీ చేసింది.
ఇసారైనా ఇంటర్న్‌షిప్ చేస్తారా?
వర్సిటీ పరిధిలో 2024–26 బ్యాచ్‌కి 46 బీఈడీ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో సుమారు 3,500 మంది ఛాత్రోపాధ్యాయులు(విద్యార్థులు) ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం నేటి(సోమవారం)నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు 8 వారాలు జరగాల్సిన బ్లాక్ టీచింగ్‌ను నాలుగు వారాలకు కుదించారు. ఈ నాలుగు వారాల్లో సంక్రాంతి సెలవులు, ఆదివారాలు మొత్తం సుమారు 15 రోజులు సెలవుల రూపంలోనే పోతున్నాయి. ఇక మిగిలింది రెండు వారాలు మాత్రమే. కేవలం బ్లాక్ టీచింగ్‌ను రెండు వారాల్లోనే మమ అనేపించేలా షెడ్యూల్ ఉంది. రెండు, మూడు రోజుల క్రితమే బీఈడీ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత వరకు బ్లాక్ టీచింగ్‌కు అనుమతులే ఇవ్వలేదని డీఈఓ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఆర్‌యూ వీసీ ఆచార్య వెంకట బసవరావును వివరణ కోరగా.. 2024–26 బ్యాచ్‌కి చెందిన బీఈడీ విద్యార్థులకు మరోసారి థర్డ్ సెమిస్టర్ బ్లాక్ టీచింగ్ చేయాలని నిర్ణయించిన మాట వాస్తవమేనన్నారు.


