కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం
● ఇక్కడ ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు
● ఎన్ని అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యం
● కలెక్టరేట్ ఎదుట పెద్దస్వామి
కుటుంబం ఆందోళన
కర్నూలు(సెంట్రల్): ‘ఫోర్జరీ డాక్యుమెంట్‌తో మా పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా ప్రాణాలకు రక్షణ ఇవ్వండి అని ఫోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యం. ఇక మాకు మిగిలింది కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే.’ అని పెద్దస్వామి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహంవ ద్ద జోహరాపురానికి చెందిన పెద్దస్వామి, ఆయన సతీమణి మద్దమ్మ, ఆయన కుమారుడు, కోడలు మహేంద్ర, లక్ష్మీ, కుమార్తెలు మంజు, మాలతీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కుటుంబానికి కర్నూలు అర్బన్ మండలం జోహరాపురంలో సర్వే నంబర్ 68/2ఏలో మూడు ఎకరాల పొలం ఉందన్నారు. దానిని ఆశాపోగు గోపాల్, షేక్ షరీఫ్, ప్రవీణ్ అనే వ్యక్తులు 68/2ఏఐవీ అని చూపుతూ ఫోర్జరీ డాక్యుమెంట్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. దాని ఆధారంగా 25 ఏళ్ల నుంచి అనుభవంలో ఉన్న తమపై దాడికి వస్తున్నారని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఫోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, తమనే పోలీసు స్టేషన్‌లో పెట్టి అక్రమార్కులతో మాట్లాడుతున్నారన్నారు. తమ భూమిపైకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌లో పదిసార్లు అర్జీలు ఇచ్చినట్లు చెప్పారు. తహసీల్దార్‌కు అయితే లెక్కలేనన్నీసార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికై నా అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.


