దొంగలు దొరికారు! | - | Sakshi
Sakshi News home page

దొంగలు దొరికారు!

Apr 2 2026 7:59 AM | Updated on Apr 2 2026 7:59 AM

నాలుగు రోజుల వ్యవధిలోనే

ఛేదించిన పోలీసులు

20 తులాల బంగారు,

10 తులాల వెండి ఆభరణాలు రికవరీ

కర్నూలు: కర్నూలు వెంకటరమణ కాలనీ శివారులోని అమీన్‌ అబ్బాస్‌ నగర్‌లో నివాసముంటున్న వెంకటసుబ్బయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు దొరికారు. నాలుగు రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. నిందితులిద్దరూ మైనర్లు కావడంతో జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ముందు హాజరుపరిచారు.

ఇంటి తాళం పగులగొట్టి చోరీ

అమీన్‌ అబ్బాస్‌ నగర్‌లో నివాసముంటున్న వెంకట సుబ్బయ్య పేపర్‌ మిల్లులో పనిచేసి రిటైరయ్యారు. గత నెల 27న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కడపకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు 29వ తేదీ రాత్రి వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వేలిముద్రలను సేకరించారు. నిందితులు బాలాజీ నగర్‌లో నివాసముండే ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. బుధవారం ఉదయం మునగాలపాడు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు వద్ద ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారు చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌, నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహ, మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వెల్లడించారు. నిందితులు గతంలో గణేష్‌నగర్‌ శివారులోని సాయివైభవ్‌ నగర్‌లో ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ నేరాల బాట పట్టారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన క్రైం పార్టీ సిబ్బంది మురళీధర్‌, సుబ్బరాయుడు, సుంకన్న, చెంచన్న, శేఖర్‌, వాసులను డీఎస్పీ అభినందించారు.

జల్సాల కోసం జతకట్టి..

నిందితులు ఒకరు ఇంటర్‌, మరొకరు పదో తరగతి వరకు చదువుకున్నారు. జులాయిగా తిరుగుతూ గంజాయి, బెట్టింగ్‌లకు అలవాటుపడ్డారు. జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులను ఎంచుకున్నారు. ప్రస్తుతం బంగారు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బంగారు నగలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement