● 30 కిలోల బస్తా రూ.50 కూడా
పలకని వైనం
● రోడ్డుపక్కన పారబోస్తున్న రైతులు
దేవనకొండ: ఘుమఘుమలాడే గుత్తి వంకాయను చూస్తే ఎవరికై నా నోరూరుతుంది. అయితే అదే వంకాయ ఇప్పుడు రైతులకు గుదిబండగా మారింది. సరైన గిట్టుబాటు లేక, మార్కెట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు రాకపోవడంతో వంకాయ సాగుచేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను అలాగే వదిలేస్తే పాడవుతుందని మున్ముందు అయినా రేటు పెరగకపోతుందా? అనే ఆశతో కూలీలచే వంకాయలు తెంపి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. వంకాయకు ధర లేకపోవడంతో సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌లో 30 కిలోల బస్తా రూ.40 నుంచి రూ.50 కూడా పలకడం లేదు. అయితే వ్యాపారులు మాత్రం ప్రజలకు కిలో రూ.30 నుంచి రూ.40కు అమ్ముకుంటున్నారు. రైతుల వద్ద 30 కిలోల బస్తాను రూ.50కి కూడా వ్యాపారులు కొనడం లేదు. దీంతో చాలామంది రైతులు వంకాయలను గొర్రెలకు వదిలేస్తున్నారు. కొద్ది మంది రైతులు మున్ముందు రేటు పెరుగుతుందన్న ఆశతో తోటను కాపాడుకునేందుకు వంకాయలు తెంపి రోడ్డున పారపోస్తున్నారు.


