డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

Apr 2 2026 7:59 AM | Updated on Apr 2 2026 7:59 AM

కర్నూలు కల్చరల్‌: డాక్టర్‌ అబ్దుల్‌హక్‌ ఉర్దూ విశ్వ విద్యాలయం డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్‌ నెలలో నిర్వహించిన డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహబూబ్‌ బాషా బుధవారం విడుదల చేశారు. డిగ్రీ 3, 5 సెమిస్టర్లు, పీజీ 3వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశామన్నారు. విద్యార్థులు ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌ www.ah uuk.ac.in నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎగ్జామినేషన్‌ కోఆర్డినేటర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌, సైన్స్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నబియా సుల్తానా, ఆర్ట్స్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో పలువురు అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా షిఫ్ట్‌ ఆపరేటర్లుగా నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు వెల్లడైంది. నకిలీ ధ్రువపత్రాలతో అనేక మంది ఉద్యోగాలు పొందినట్లు సీఎండీకి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి నిర్వహించిన విచారణలో 16 మంది షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు పొందినట్లు స్పష్టమైంది. నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు రాయలసీమ జిల్లాల్లో 69 మంది ఉండగా ఉమ్మడి జిల్లాలో 16 మంది ఉన్నారు. ఐటీఐ చేయకుండానే ఎలక్ట్రీషియన్‌లో ఐటీఐ పూర్తి చేసినట్లు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపధ్యంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన షిఫ్ట్‌ ఆపరేటర్లను తొలగించాల్సిందిగా సంబంధిత అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేయాలని కర్నూలు, నంద్యాల సర్కిళ్ల ఎస్‌ఈలను సీఎండీ ఆదేశించారు. ఈ మేరకు ఎస్‌ఈలు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

కారు ఢీకొని ఉద్యోగి దుర్మరణం

ఓర్వకల్లు: కర్నూలు, కడప జాతీయ రహదారిపై రాక్‌గార్డెన్‌ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని కన్నమడకల గ్రామ సచివాలయంలో రంగస్వామి (33) ఇంజినీరింగ్‌ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నాడు. కర్నూలు నుంచి బైక్‌పై కన్నమడకల చేరుకుని విధులకు హాజరయ్యేవాడు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని కర్నూలుకు బైక్‌పై బయలుదేరాడు. స్థానిక ఎయిర్‌పోర్టు వద్ద ముందు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి నంద్యాల నుంచి కర్నూలు వైపు అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రంగస్వామి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక రంగస్వామి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement