ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈనామ్ 2.0 కొత్త వర్షన్ రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులకు తలనొప్పిగా మారింది. రెండు రోజులుగా కొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త వెర్షన్‌లో రైతు ఊరు, పేరు, సెల్ నంబర్‌తో పాటు ఓటీపీ కూడా చెప్పాలనడంతో ఒక్కసారిగా రైతులు, ఏజెంట్లు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఓటీపీ చెప్పవసరం లేదనడంతో వారు వెనుదిరిగారు. కొత్త వెర్షన్‌లో మంగళవారం సాయంత్రం 5 – 6 గంటల సమయంలో టెండర్ ధర ప్రకటన రావడంతో రైతులు, ఏజెంట్లు, వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం సాయంత్రం అయినా టెండర్ ధర ప్రకటన రాకపోవడంతో రైతులు యార్డు కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. టెక్నికల్ సిబ్బంది వచ్చారని, సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు. అయితే రైతులు సాయంత్రం టెండర్ ధర ప్రకటన వస్తే దిగుబడులను కాటా ఎప్పుడు వేసుకోవాలి, తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతి అయినా పెట్టండి లేదా మాన్యువల్‌గా నిర్వహించాలని కోరారు. పాత పద్ధతి ఈనామ్ డెలీట్ చేసి కొత్త వెర్షన్ తెచ్చినట్లు చెప్పడంతో రైతులు, ఏజెంట్లు మండిపడ్డారు. ఇలాంటి కొత్త వెర్షన్‌లను అన్ సీజన్‌లో ప్రయోగం చేయాలే గానీ, సీజన్‌లో తెచ్చి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. ఉదయం 8 గంటలకు పల్లెల నుంచి దిగుబడులు వేసుకొస్తే రాత్రి బస్సులు లేక ఎలా వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్‌ను వివరణ కోరగా.. కొత్త వెర్షన్ రావడంతో త్వరగా నమోదుకావడం లేదని, ఈనామ్ వారు వచ్చారని, త్వరలో సమస్యను పరిష్కరిస్తారన్నారు.


