కారులో రూ.5 లక్షలు చోరీ
ఆదోని అర్బన్: కారు అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో ఉన్న రూ.5 లక్షలు నగదును దొంగలించి పరారైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకులో తీసుకున్న రుణాన్ని కట్టేందుకు బసాపురం గ్రామానికి చెందిన రైతు రమేష్, ఆయన కుమారుడు రఘు ఆదోని పట్టణానికి వచ్చారు. రుణాన్ని కట్టేందుకు వారి బంధువు అయిన చంద్రప్ప వద్ద రూ.5 లక్షలు అడిగారు. చంద్రప్ప స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో డ్రా చేసి కారులో కూర్చొని వారికి రూ.5 లక్షలు అందజేశారు. డబ్బును ముందు సీటులో ఉన్న క్యాష్ బోర్డులో పెట్టారు. లోన్ కట్టేందుకు మరో రూ.50 వేలు తక్కువగా ఉండడంతో వెంటనే శేఖర్ అనే వ్యక్తిని అడిగారు. శేఖర్ ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న మారుతి వైన్స్ దగ్గర వస్తే ఇస్తానని చెప్పడంతో వెంటనే తండ్రి, కుమారుడు కారులో అక్కడికి చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్‌లో కారును ఉంచి శేఖర్ దగ్గరకు వెళ్లి రూ.50 వేలు డబ్బు ఇప్పించుకుని తిరిగి వచ్చారు. కారుకు ముందు ఎడమ డోర్ అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో పెట్టిన రూ.5 లక్షలు నగదు అపహరణ కావడంతో తండ్రి, కుమారుడు అవాక్కయ్యారు. దీంతో వెంటనే త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తండ్రి, కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎవరైనా వెంబడించారా అనే కోణంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తామని సీఐ తెలిపారు.


