5 లక్షల కుటుంబాలకు దెబ్బ | - | Sakshi
Sakshi News home page

5 లక్షల కుటుంబాలకు దెబ్బ

Dec 31 2025 7:06 AM | Updated on Dec 31 2025 7:06 AM

5 లక్షల కుటుంబాలకు దెబ్బ

5 లక్షల కుటుంబాలకు దెబ్బ

వీబీజీ రామ్‌జీతో ఉమ్మడి జిల్లాకు తీరని నష్టం

5 లక్షల కుటుంబాల్లో అయోమయం

రాష్ట్రం వాటా నిధులు పెంచిన కేంద్రం

ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు

గత జూలై 22 నుంచి కూలీలకు వేతనాలు కరువు

ఏప్రిల్‌ 1 నుంచి నిలిచిపోయిన పల్లె పండగ చెల్లింపులు

కౌతాళం మండలం ఓబుళపురం నుంచి హైదరాబాదుకు వలస వెళ్తున్న కూలీలు (ఫైల్‌)

కర్నూలు(అగ్రికల్చర్‌): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వస్తున్న వీబీజీ రామ్‌జీ వ్యవసాయ కూలీల జీవితాల్లో చిచ్చు పెట్టనుంది. ప్రజలను ఉపాధికి దూరం చేసే కొత్త పథకం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త పథకంతో కేంద్రం రాష్ట్రాలు భరించే వాటాను పెంచడాన్ని పరిశీలిస్తే.. ఇక పేదలు, వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతుల ఉపాధి నిర్వీర్యం అయినట్టే కనిపిస్తోంది. అప్పులు చేయడంలో రాణిస్తున్న చంద్రబాబు సర్కార్‌ రామ్‌జీ ద్వారా చేపట్టే ఉపాధి పనులకు తమ వాటా ఎక్కడి నుంచి ఇస్తారనే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఉపాధి కూలీలకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వని పరిస్థితి. పల్లెపండుగ కింద ఉపాధి నిధులతో చేపట్టిన పనులకు ఏప్రిల్‌ నుంచి ఎలాంటి చెల్లింపులు లేవు. కరువుపీడిత ప్రాంతాల్లో కర్నూలు జిల్లా మొదటిస్థానంలో ఉంటోంది. ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎక్కువ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేకపోతే వలసలు ఇప్పుడున్న వాటితో పోలిస్తే మూడు రెట్లు అధికం కానున్నాయి. పేదలకు అన్నం పెట్టే ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2007లో ఓర్వకల్‌ మండలంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలసి ప్రారంభించారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం పేదలను ఉపాధికి దూరం చేయనుండటం గమనార్హం.

అప్పుల బాబుతో సాధ్యమేనా..

ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్‌ కాంపోనెంటు కింద చేపడుతున్న పనులకు 100 శాతం వేజ్‌ కేంద్రం భరిస్తోంది. మెటీరియల్‌ కింద చేపట్టే పనులకు 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం వాటా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం లేబర్‌, మెటీరియల్‌ కాంపోనెంటు కింద చేపట్టే పనులకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను పక్క న పెట్టి కొత్తగా అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ కింద చేపట్టే లేబర్‌, మెటీరియల్‌ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అకౌంట్‌కు రాష్ట్రం వాటాను విడుదల చేసిన తర్వాతనే నిధులు విడుదలవుతాయి. అప్పులతో నెట్టుకొస్తున్న చంద్రబాబు సర్కార్‌ తమ వాటా నిధులు అంత సులభంగా ఇచ్చే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

వ్యక్తిగత సబ్సిడీ రూ.2 లక్షల వరకే..

2024–25 వరకు పండ్లతోటల అభివృద్ధిలో గరిష్టంగా ఐదు ఎకరాల వరకు పూర్తి సబ్సిడీ పొందే అవకాశం ఉండింది. సబ్సిడీ కింద రూ.5 లక్షలకు పైగా రైతులు పొందే వీలుండేది. మరోవైపు ఫాంపాండ్స్‌ వంటి వాటిని తవ్వుకోవడం ద్వారా కూడా సబ్సిడీలు పొందుతున్నారు. ఇప్పటి వరకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ లభిస్తోంది. అయితే ఉపాధి నిధులతో వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధి(పండ్లతోటలు, ఫాంపాండ్స్‌ తదితరాలు) ద్వారా ఇస్తున్న సబ్సిడీని ప్రస్తుతం రూ.2 లక్షలకు పరిమితం చేశారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు కూడా జరిగిపోయాయి.

పేరు మార్చి.. మట్టి కొట్టి

నిలిచిపోయిన చెల్లింపులు

ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో కేంద్రానిదే పూర్తి అధికారం ఉన్నప్పటికీ లేబర్‌ కాంపోనెంటు కింద 2025 జూలై 22 నుంచి, మెటీరియల్‌ కాంపోనెంటు కింద ఏప్రిల్‌ 1 నుంచి చెల్లింపులు లేవు.

కర్నూలు జిల్లాలో దాదాపు రూ.80 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.65 కోట్ల బకాయిలు ఉన్నాయి.

చెల్లింపులు లేకపోవడంతో ఉపాధి పనులకు లేబర్‌ హాజరు తగ్గిపోయింది.

మొదటి విడత పల్లెపండుగ పనులకు చెల్లింపులు ఏప్రిల్‌ నుంచి లేకపోవడంతో రెండవ విడత పల్లె పండుగను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

పండ్లతోటలకు సంబంధించి ఏడాదిన్నర నుంచి నిర్వహణ చెల్లింపులు నిలిచిపోయాయి.

మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కర్నూలు జిల్లాలో 2.75 లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 2.25 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఏటా ఈ కుటుంబాలకు 1.85 కోట్ల పని దినాలు కల్పిస్తున్నారు. కొత్తగా తెస్తున్న వీబీజీ రామ్‌జీ వల్ల ఉమ్మడి జిల్లాలో 5 లక్షల కుటుంబాలకు నష్టం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 2025–26లో ఇప్పటి వరకు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు 3,100 మాత్రమే. ప్రస్తుతం కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనేది నిబంధన. కొత్త పథకం ప్రకారం కుటుంబానికి 125 రోజులు పని కల్పిస్తారు. ఉపాధి పనులపై ఆధారపడిన వారికి ఇది కొంతమేర ఊరట కలిగిస్తుంది. అయితే రెక్కలు వంచి పని చేస్తే వేతనాలు అందుతాయా, లేదా అనేది ప్రశ్నార్థకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement