పెద్ద హరివాణం.. రగిలిన ఉద్యమం
ఆదోని రూరల్: ఓ వైపు ఆదోని మండలంలో 16 గ్రామాల ప్రజలు ప్రత్యేక మండలం వద్దంటూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్న తరుణంలో గెజిట్ ప్రకారం పెద్ద హరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్తులు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అతి పెద్ద మండలమైన ఆదోనిని రెండు మండలాలుగా విభజిస్తూ పెద్దహరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించింది. అయితే పెద్దహరివాణం మండలంలో విలీనానికి ప్రతిపాదించిన 16 గ్రామాల ప్రజలు గత నెల రోజులుగా ఆందోళన లు చేపట్టారు. చిన్నగొనేహాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభు త్వం వెనుకడుగు వేసి ఆదోని–1, ఆదోని–2గా ప్రకటించడంతో మంగళవారం పెద్దహరివాణం ప్రజలు కన్నెర్రజేశారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి గ్రామ బస్టాండులో నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా గ్రామస్తులు ఆదోని – సిరుగుప్ప రహదారులను దిగ్బంధం చేసి రాకపోకలను నిలిపివేశారు. అలా గే టైర్లు, పాత వాహనాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పెద్దహరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు పోరాడుతామని నినాదాలు చేశారు. దీంతో దాదాపు రెండు గంటలపాటు ఆదోని–సిరుగుప్పకు రాపోకలు ఆగిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి రహదారిని క్లియర్ చేయడంతో వాహనాలు ముందుకు కదిలాయి. పెద్దహరివాణం మండలం సాధించే వరకు పోరాడుతామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
ఆదోని రూరల్: పెద్దహరివాణం గ్రామానికి చెంది న గాదెలింగ(23) మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గాదెలింగ ట్రాక్టర్ డ్రైవర్. ఎప్పటిలానే ట్రాక్టర్‌లో గ్రావెల్ లోడు తీసుకెళ్తుండగా పెద్దహరివాణంలోని బస్టాండు ప్రాంతంలోని ప్రధాన రోడ్డులో రాస్తారోకో, ధర్నా చేస్తుండటంతో అడ్డదారిలో వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి లోనై మరణించాడు. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో గాదెలింగ పెద్దహరివాణం గ్రామాన్ని మండలంగా కాకుండా, ఆదోని 1, 2 మండలాలుగా విభజించడం వల్లే కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడనే సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఇస్వి పోలీస్‌స్టేషన్ ఎస్.మహేష్ కుమార్‌ను వివరణ కోరగా విషయం తమ దృష్టికి రాలేదన్నారు.
పెద్ద హరివాణం.. రగిలిన ఉద్యమం


