దొరకని ఆచూకీ.. ఆగని కన్నీళ్లు
● ఎస్సార్‌బీసీ కాల్వలో దూకిన తల్లీ బిడ్డల కోసం కొనసాగుతున్న గాలింపు
గడివేముల: అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు పిల్లలతో ఎస్సార్‌బీసీ కాల్వలో దూకిన మహిళ కోసం బంధువులు, గ్రామస్తులు కాల్వ వెంట పండుతున్న బాధలు వర్ణణాతీతం. ఆదివారం ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లె ఎల్లా లక్ష్మి (23), వైష్ణవి (3), సంగీత (మూడు నెలలు) గడివేముల మండలం మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్సార్‌బీసీ కాల్వలోకి దూకిన విషయం తెలిసిందే. వారి కోసం సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సహాయక బృందాలు గాలింపు చేపట్టారు. పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, నంద్యాల జిల్లా ఫైర్ సిబ్బంది చైతన్య కుమార్‌రెడ్డి, రాజేశ్వర్‌నాయక్, ఇస్మాయిల్, ఉశేన్‌సాహెబ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఎస్సార్‌బీసీ కాల్వలో పుట్టిలు, ఇంజిన బొట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల వారు, ఒండుట్ల గ్రామానికి చెందిన బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో ఎస్సార్‌బీసీ కాల్వ వద్దకు చేరుకున్నారు. తమవారిని త్వరగా కనిపెట్టాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది.


