బెలుం అందాలు అద్భుతం
కొలిమిగుండ్ల: వందల ఏళ్ల క్రితం భూమి లోపల ఏర్పడిన బెలుం గుహల సహజ అందాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేష్‌కుమార్‌సింగ్ కొనియాడారు. రాయలసీమ జిల్లాల్లోని చారిత్రక ప్రదేశాల సందర్శనార్థం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బెలుం గుహలకు వచ్చారు. గుహల వద్దకు చేరుకున్న ఆయనకు మేనేజర్ కిషోర్, ఎంపీడీఓ దస్తగిరిబాబు, డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వర గౌడ్ స్వాగతం పలికారు. అనంతరం గుహ లోపలికి చేరుకొని కోటిలింగాలు, వేయిపడగలు, మాయమందిరం తదితర ప్రదేశాలను తిలకించారు. గుహలోపల గంటకు పైగానే గడిపారు. గుహలు ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటి ప్రాముఖ్యత తదితర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. భూమి అంతర్భాగంలో ఇంత విశాలంగా అవతరించనందువల్లే బెలుం గుహలు ప్రపంచంలో గుర్తింపు పొందాయని చెప్పారు. గుహలను తిలకించడం ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు ఆయన వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటను పరిశీలించారు. బెలుం గుహల అనంతరం యాగంటి, మహానంది పుణ్యక్షేత్రాల దర్శనార్థం వెళ్లారు.


