కేంద్ర నిధులపై మీ పెత్తనం ఏంటి?
కొలిమిగుండ్ల: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులపై మీ పెత్తనం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. సోమవారం బెలుం గుహల సందర్శనకు వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ రాజేష్‌కుమార్ సింగ్‌ను జిల్లా, రాష్ట్ర నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్‌ల పట్ల వివక్ష చూపుతూ కేంద్రం విడుదల చేసే నిధులను డైవర్ట్ చేస్తోందన్నారు. ఎనిమిది నెలల నుంచి పంచాయతీరాజ్ విభాగం నుంచి విడతల వారీగా ఉద్యమిస్తే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నారు. ఈవిషయంలో కేంద్రం మొట్టికాయ వేస్తే దాదాపు రూ.64 కోట్లు వడ్డీ సహా స్థానిక సంస్థలకు జమ చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చే మార్చి నాటికి సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుండటంతో ఈ సర్పంచ్‌లతో ఎందుకు పనులు చేయించాలనే దురుద్దేశంతో నిధులు నిలిపేస్తూ సర్క్యులర్ ఇచ్చిందన్నారు.కేంద్రం నిధులను నిలబెట్టడా నికి, తొక్కి పెట్టడానికి మీరెవరు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అని నిలదీశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేయరాదని చెప్పడానికి మీకేం హక్కు ఉందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ విభాగానికి గుదిబండగా మారాడని విమర్శించారు. తక్షణమే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్య క్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభా గం జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి అప్పిరెడ్డి గారి సురేష్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ రంగారెడ్డి, నంద్యాల, రాప్తాడు నియోజకవర్గాల అధ్య క్షులు మహేష్‌రెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు చాంద్‌బాషా తదితరులు వెంట ఉన్నారు.


