పదునెక్కిన కత్తులు.. దారులు రక్తపుటేరులు!
2025లో కొనసాగిన నేరాల పరంపర
మహిళలపై ఆగని వేధింపులు
పెరిగిన రోడ్డు ప్రమాదాలు
జిల్లా వార్షిక నేరాల వివరాలు వెల్లడించిన ఎస్పీ
శిక్షల శాతం పెంపునకు ప్రత్యేక దృష్టి
సంవత్సరం 2024 2025
డ్రంకెన్ డ్రైవ్ కేసులు 1,613 9,196
ఓపెన్ డ్రింకింగ్ 4,338 17,392
హత్యాయత్నాలు 41 49
కిడ్నాప్‌లు 16 17
పగటి దొంగతనాలు 26 46
రాత్రి దొంగతనాలు 117 119
హత్యలు 34 29
కర్నూలు: శాంతిభద్రతలు జిల్లాలో అదుపులో ఉన్నాయని, అనేక నేరాలు తగ్గాయని గణాంకాలతో కనికట్టు చేసేందుకు పోలీసు శాఖ యత్నించినా నేరాల గుట్టు దాగలేదు. ఎంతగా దాచాలన్నా పోలీసు శాఖ వైఫల్యం మాత్రం కొన్ని నేరాల పెరుగుదలతో బట్టబయలైంది. జిల్లాలో గత ఏడాదితో పోల్చితే అన్ని రకాల నేరాలు కలిపి ఒక శాతం పెరిగాయి. కిందటి ఏడాదిలో అన్ని రకాల కేసులు 4,022 నమోదు కాగా ఈ ఏడాది 4,051 కేసులు నమోదు కావడం జిల్లాలో నేర విస్తరణ ఎలా ఉందో అర్థమవుతోంది. సైబర్ మోసాలు, ఆస్తి తగాదాలు, దొంగతనాలు, హత్యలు... ఇలా పలు ఆకృత్యాలకు అడ్డుకట్ట పడలేదు. రహదారి ప్రమాదాలు పెరిగాయి. నేరాల అదుపునకు పోలీసు శాఖ సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ ఆగడాలకు అడ్డుకట్ట పడలేకపోయింది. జిల్లాలో 2025 సంవత్సరంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరిస్తూ పోలీసు శాఖ వార్షిక నివేదికను మంగళవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో విడుదల చేశారు. అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం, అపసవ్య దిశలో నడపటం వంటి అనేక కారణాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. సగటున రోజుకు మూడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి. కిందటిసారి 547 ప్రమాదాలు జరగగా 270 మంది మృతిచెందారు. 277 మంది గాయపడ్డారు. ఈ ఏడాది 658 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 278 మంది మృతిచెందగా 380 మంది గాయపడ్డారు.
చోరీలతో పరేషాన్...
ఆస్తి సంబంధ నేరాలు కలవరానికి గురి చేస్తున్నాయి. దోపిడీ, డెకాయిటీ గత ఏడాదిలో ఐదు కేసులు నమో దు కాగా ఈసారి ఆ సంఖ్య 12కు చేరింది. వీటిలో బంగారం, వెండి, నగదు, ఇతర వస్తువుల చోరీకి సంబంధించి గడచిన ఏడాది 290 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 283కు చేరింది. పగలు, రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోయారు. పగటి దొంగతనాలు 2024లో 26 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 46కు చేరింది. రాత్రి దొంగతనాలు గత ఏడా ది 117 కాగా ఈ ఏడాది 119 కేసులు నమోదయ్యా యి. 283 చోరీ కేసుల్లో రూ.8.90 కోట్లు జిల్లా ప్రజలు నష్టపోగా రూ.6.07 కోట్లు మాత్రమే రికవరీ చేశారు.
భారీగా పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు...
మద్యం విక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోంది. ఖజానాను నింపుకోవడానికి విచ్చలవిడిగా బెల్టు షాపులను ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. దీంతో మద్యం సేవించి వాహనదారులు రోడ్లపైకి ఎక్కి ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలో భారీగా నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులే మద్యం విక్రయాల తీవ్రతకు నిదర్శనం. గత ఏడాది 1,613 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 9,196 కేసులు నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే ఓపెన్ డ్రింకింగ్ కేసులు కూడా గత ఏడాది 4,338 నమోదు కాగా, ఈ ఏడాది 17,392 కేసులు నమోదయ్యాయి. కేసుల్లో పట్టుబడిన వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా భారీగా జరిమానా విధిస్తున్నారు. మద్యం విక్రయాలతో పాటు జరిమానా రూపంలో కూడా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది.
నేరాల్లో త్వరితగతిన శిక్షల శాతం పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాం. ఈ సంవత్సరం 23 కేసులలో 53 మందికి జైలు శిక్షలు పడ్డాయి. ఐదు కేసుల్లో 15 మందికి జీవిత ఖైదు, రెండు కేసుల్లో ఇద్దరికి ఇరవై ఏళ్లు, ఒక కేసులో ఐదుగురికి తొమ్మిదేళ్లు, మరో కేసులో ఐదుగురికి ఏడేళ్లు, మూడు కేసుల్లో 11 మందికి ఐదేళ్లు, ఒక కేసులో ఇద్దరిపై నాలుగేళ్లు, నాలుగు కేసుల్లో ఆరుగురిపై మూడేళ్లు, రెండు కేసుల్లో ఇద్దరిపై రెండేళ్లు, నాలుగు కేసుల్లో ఐదుగురిపై ఏడాది పాటు శిక్షలు పడ్డాయి. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే శిక్షల సంఖ్య పెరిగింది.
– విక్రాంత్ పాటిల్, ఎస్పీ


