వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటయ్య క్షేత్రంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉద యం వేదపండితులు గోపూజ, స్వామివారికి విష్వక్సేనారాధన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన పూజలు చేపట్టారు. సాయంత్రం రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, చతుస్థానార్చన, దీక్షా హోమం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు మద్దిలేటి నరసింహ స్వామి వారికి విశేష పుష్పాలంకరణతో పాటు సహస్ర దీపాలంకరణ సేవ, అష్టవిధ మహామంగళహారతి సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారు నారాయణ అవతారంలో సహస్ర దీపాలంకరణలో సేవలో భక్తులకు దర్శన మిచ్చారు. హనుమద్ వాహనంపై కొలువైన స్వామి వారు ఆలయ ఆవరణలో విహరించారు.


