ఆదోని జిల్లా కోసం ఉద్యమం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా కోసం ఐక్యంగా ఉద్యమం చేస్తున్నామని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, వీరేష్, వీరేష్, రఘురామయ్య పేర్కొన్నారు. ఆదోని పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 43వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదోనిని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని, లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆదోనిని జిల్లా చేసేంతవరకు పోరాటం ఆపబోమని చెప్పారు.
ఊరంతా గాదిలింగప్పలు
ఆలూరు: హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి వెళ్లి ‘గాదిలింగప్ప’ అని పిలిస్తే వేల మంది వస్తారు. గ్రామంలో గాదిలింగప్ప తాత ఆలయం ఉంగా మొత్తం 8,900 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ప్రతి కుటుంబంలో మగ వారికి గాదెప్ప, గాదిలింగప్ప, ఆడవారికి గాదెమ్మ అని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు గ్రామంలో 2,500 మంది వరకు ఉన్నట్లు పెద్దలు చెబుతున్నారు. గ్రామంలో చిరు తగాదాలు ఏర్పడితే అధికారులకు ఏ గాదిలింగప్ప, లింగన్నలు ఫిర్యాదు చేశారో తెలియడం లేదు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్‌లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు.
31న పింఛన్ల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): జనవరి పింఛన్లను ఇంటింటికీ వెళ్లి డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. ఇందుకోసం డిసెంబర్ 30న ఫింఛన్ సొమ్మును డ్రా చేసుకొని సేఫ్ లాకర్లలో ఉంచుకునేలా చూడాలని కోరారు. ఆదివారం ఉదయం ఆమె టెలీకాన్ఫరెన్స్ ద్వారా పింఛన్ల పంపిణీపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పింఛన్ల పంపిణీలో అవితినీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సచివాలయ ఉద్యోగులను హెచ్చరించారు. పింఛన్ ఇవ్వడానికి ఇటీవల లంచం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. మరోసారి ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
బెలుం గుహలకు పర్యాటకుల తాకిడి
కొలిమిగుండ్ల: భూగర్భంలో అవతరించిన బెలుం గుహల సహజ అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూకట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో కర్ణాటకతో ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుహ లోపల పర్యాటకులతో రద్దీగా మారింది. గుహ లోపల అవతరించిన పలు ప్రాంతాలను తిలకించి వాటి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆదోని జిల్లా కోసం ఉద్యమం
ఆదోని జిల్లా కోసం ఉద్యమం


