విక్రాంత్ పాటిల్‌కు డీఐజీగా పదోన్నతి
కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు డీఐజీగా పదోన్నతి లభించింది. ఏపీ క్యాడర్‌కు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్‌కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026 జనవరి 1 నుంచి పదోన్నతి జీవో అమలులోకి వస్తుంది. అప్పటివరకు ఈయన ఈ పదవిలోనే కొనసాగనున్నారు. 2012 ఐపీఎస్ అధికారి అయిన విక్రాంత్ పాటిల్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
బెటాలియన్స్,
అనంతపురం డీఐజీగా ?
ఏపీఎస్పీ బెటాలియన్స్ రేంజ్–2(కర్నూలు) డీఐజీ పోస్టు ప్రస్తుతం ఇన్‌చార్జ్ పాలనలో కొనసాగుతోంది. ఇక్కడ డీఐజీగా పనిచేసిన వెంకటేశ్వర్లు 2024 ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. అప్పటినుంచి గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్న డీఐజీ సీతారాం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా జనవరి 30న పదవీ విరమణ పొందనున్నారు. దీంతో విక్రాంత్ పాటిల్‌కు బెటాలియన్స్ రేంజ్–2 డీఐజీగా, అనంతపురం రేంజ్ డీఐజీగా పోస్టింగ్ దక్కే అవకాశమున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న షెమూషి ఐజీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్ కమాండెంట్‌గా ఎస్పీ సతీమణి దీపిక పాటిల్ విధులు నిర్వహిస్తున్నారు. స్పౌజ్ గ్రౌండ్ కింద విక్రాంత్ పాటిల్‌ను బెటాలియన్స్ డీఐజీగా ప్రభుత్వం నియమించే అవకాశమున్నట్లు కూడా పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు.
ఆ నలుగురూ జిల్లాకు సుపరిచితులే
జిల్లాలో పూర్వపు ఎస్పీలుగా పనిచేసిన శంకబ్రత బాగ్చి డీజీపీగా, గోపీనాథ్ జెట్టి, ఆదోని అదనపు ఎస్పీగా పనిచేసిన డాక్టర్ షమూషి బాజ్‌పేయి, కర్నూలు రేంజ్ డీఐజీగా పనిచేసిన సెంథిల్ కుమార్‌లకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ నలుగురూ జిల్లాకు సుపరిచితులే.


