నంద్యాల జిల్లాలో దయనీయం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నంద్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దయనీయంగా మారింది. కొనేవారు లేక వ్యాపారులు అప్పులపాలవుతున్నారు. గతంలో రేట్లు భారీగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన తర్వాత అనుకోకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రేట్లు భారీగా పతనమయ్యాయి. నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో 2024కి ముందు ఎకరం రూ.6 కోట్ల వరకు విక్రయించారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో రూ.3 కోట్లకు మించి ధర పలకడం లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఏడాదిలో 50 శాతం రేట్లు పతనమవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో వ్యాపారులు ఉన్నారు. ధరలు భారీగా పడడంతో అప్పుల్లో కూరుకుపోయిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు ఐపీ పెట్టి నంద్యాలను వదిలేసి వెళ్లిపోయారు. మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నారు.
● 2024–25కు సంబంధించి జిల్లాకు రూ.260.36 కోట్ల లక్ష్యంగా నిర్ణయిస్తే రూ.150.07 కోట్లు మాత్రమే సమకూరింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండడంతో రిజిస్ట్రార్లు ఆందోళనకు గురవుతున్నారు.
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో రూ. 171.22 కోట్లు ఆదాయం వచ్చింది.
● ఒక్క ఏడాదిలోనే జిల్లాలో రూ. 21.05 కోట్ల ఆదాయం తగ్గింది.


