శ్రీగిరి భక్తులకు ఆన్‘లైన్’కష్టాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో వెనకడుగు వేస్తున్నారు. శ్రీశైల దేవస్థానంలో గత మూడేళ్ల నుంచి అన్ని ఆర్జిత సేవలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో భక్తులు వారి ఇంటి నుంచే ఉభయ దేవాలయా ల్లో నిర్వహించే ఆర్జిత సేవలను దేవదాయ అధికారిక వెబ్ సైట్, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్ల ను వినియోగించుకుని టికెట్స్ బుక్ చేసుకుని, సేవ లు నిర్వహించుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వాట్సాప్ గవర్నెస్ అంటూ మన మిత్ర (9552300009) వాట్సాప్ నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్‌కు ప్రజల నుంచి ప్రభుత్వం ఊహించిన స్పందన రాలేదు. దీంతో శ్రీశైల దేవస్థానం ప్రభుత్వ మెప్పు కోసం పాట్లు పడుతుందోనే విమర్శలు ఉన్నాయి. ఇందుకోసం దేవస్థాన ఈఓ ఆన్‌లైన్ సేవలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అధికారులకు మనమిత్ర వాట్సాప్‌ను భక్తులు విరివిరిగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి త్వరితగతిన దర్శనం చేసుకునేలా వారికి ప్రత్యేక క్యూలు, లడ్డూ ప్రసాదాలు సైతం తీసుకునేందుకు కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం ప్రకటించింది. ఈ మేరకు క్షేత్ర పరిధిలో పలు చోట్ల ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునేలా కియోస్క్‌లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశా రు. ఆయా కేంద్రాల్లో శివసేవకులను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు.
గంటల తరబడి నిరీక్షణ..
ఓ వైపు ఆన్‌లైన్ బుకింగ్‌పై అవగాహన కల్పిస్తున్న దేవస్థానం అధికారులు ఆ మేరకు వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రద్దీ రోజుల్లో కనీసం టైం స్లాట్ కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా భక్తులచే విస్తృతంగా ఆన్ లైన్‌లో టికెట్స్ బుక్ చేయ డం, దేవాదాయ శాఖ, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్లను వినియోగించుకుని ముందస్తుగా టిక్కె ట్లు బుక్ చేసుకున్న వారితో క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్షేత్రంలో వసతి దొరక్క, దర్శనానికి గంటల తరబడి వేచి ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ అని ప్రకటించినా.. అధికారు లు ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో క్షేత్రానికి వచ్చిన భక్తులు దేవస్థాన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం భక్తులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
శ్రీశైల వెబ్ సైట్, మన మిత్ర యాప్‌లో
అధిక సంఖ్యలో బుకింగ్
రద్దీ రోజుల్లో కరెంట్ బుకింగ్‌లోనూ
అదే పరిస్థితి
టైం స్లాట్, ప్రత్యేక క్యూ లేక
భక్తుల కష్టాలు


