సంజీవనికి అనారోగ్యం
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 104 ఎంఎంయూ వాహనాలు (సంచార చికిత్స) 40 ఉన్నాయి. వీటిని భవ్య హెల్త్ కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ పరిధిలో జిల్లాలో 40 మంది పైలెట్లు (డ్రైవర్లు), 40 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఈ వాహనాలు పీహెచ్‌సీకి మూడు కిలోమీటర్ల ఆవల ఉన్న గ్రామాలకు ప్రతి నెలా రెండు సార్లు వెళ్లి అక్కడి ప్రజలకు వైద్యపరీక్షలు చేసి, వారి వ్యాధులకు సంబంధించిన చికిత్స, మందులు అందించి వస్తారు. ఈ వాహనంలో ప్రభుత్వ వైద్యాధికారితో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఏఎంఎలు ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న భవ్య హెల్త్‌కేర్ సంస్థ సంచార చికిత్స విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వంలో నిర్వహించిన వైద్యపరీక్షల్లో ప్రస్తుతం సగం కూడా చేయడం లేదు. మందులు సైతం బీపీ, షుగర్ మినహా ఇతర మందుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో చాలా మంది మందుల కోసం ఈ వాహనాలు గాకుండా స్థానికంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌లు లేదా సమీపంలోని పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. ఈ కారణంగా సంచార చికిత్స వాహనాలు వచ్చినప్పుడు రోగుల సంఖ్య గతంలో కంటే తక్కువగా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఉద్యోగులకు నిత్యం వేధింపులు..
104 ఎంఎంయూ వాహనాల్లో పనిచేసే డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సంస్థ ఉద్యోగులు బహిరంగంగా వచ్చి నిరసన కార్యక్రమాల్లో తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. గత ఏడు నెలల నుంచి తమపై సంస్థ అనేక వేధింపులకు గురిచేస్తోందని చెబుతున్నారు. గత అరబిందో సంస్థ చివరి నెలలో చెల్లించిన జీతాలలో సైతం ప్రతి ఉద్యోగికి రూ.500 నుంచి రూ.2వేల వరకు కోతలు విధించిందని విమర్శిస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు అనేక సంవత్సరాల నుంచి అమలులో ఉన్న 15 క్యాజువల్ లీవ్‌లను ఈ సంస్థ పూర్తిగా రద్దు చేసింది. గతంలో మొత్తం సిబ్బందితో పాటు పది శాతం అదనంగా బఫర్ సిబ్బంది ఉండేవారు. ఎవ్వరైనా సెలవు పెడితే వారి స్థానంలో బఫర్ సిబ్బందిని వాడుకునే వారు. ప్రస్తుతం బఫర్ సిబ్బందిని పూర్తిగా తొలగించారు. ఉన్న వారు సెలవు పెడితే వారి వేతనాల్లో కోత విధిస్తున్నారు.
ఉద్యోగుల్లో పెల్లుబికిన ఆగ్రహం
104 వాహనాల్లో మందుల కొరత
అంతంత మాత్రంగా వైద్యపరీక్షలు
ఉద్యోగులకు నిత్యం వేధింపులు
నిరసనలతో రోడ్డెక్కిన పైలెట్లు,
డీఈఓలు
భవ్య హెల్త్‌కేర్ సంస్థ ఉద్యోగులపై అనుసరిస్తున్న చర్యలు తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి గురిచేస్తున్నాయి. యాజమాన్యం ఉద్యోగుల అసంతృప్తిని తగ్గించాల్సింది పోయి ఉద్యోగ సంఘ నాయకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయడం చేస్తూ ఆన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇటీవల 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబును సెలవులో ఉన్న సమయంలో జరిగిన వాహన తనిఖీలకు బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. ఇది ఉద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సంస్థ వేదింపులపై ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ బాధను వెలిబుచ్చారు. వీరి ఆందోళనకు వైఎస్సార్‌సీపీ నాయకులు సైతం మద్దతు తెలిపారు.


