రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– నంద్యాల ఆర్‌అండ్‌బీ రహదారిలో రేవనూరు బస్‌స్టాప్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. రేవనూరు ఏఎస్‌ఐ ఇబ్రహీం అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన పెద్దకొట్టాల రాజు (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొక్కుబడి నిమిత్తం అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లేందుకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరాడు. గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహన టైర్లు శరీరంపైకి ఎక్కడంతో తల నుంచి పొట్టభాగం వరకు శరీరభాగాలు నుజ్జయయ్యాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పట్టణానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పాత కడపకు చెందిన నాగార్జున రెడ్డి, పద్మావతి దంపతుల కుమారుడు అవినాష్‌రెడ్డి(22) హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సొంతూరుకు వచ్చిన అవినాష్‌రెడ్డి పనులు ముగించుకు శనివారం కారులో తల్లితో కలసి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్దకు రాగానే మలుపు వద్ద కారు అదుపు కాక సూచిక బోర్డును ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అవినాస్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద సమయంలో కారులో రెండు ఎయిర్ బెలూన్‌లు తెరుచుకోవడంతో పద్మావతి గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
సేంద్రియ పంట ఉత్పత్తులకు ఇండిగ్యాప్ ధ్రువపత్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించిన పంటలకు ఇండిగ్యాప్ ధ్రువపత్రాలు అందజే యనున్నట్లుగా జిల్లా వ్యవసాయ అధికారిణి పీఎల్ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సిఫారస్సు చేసిన మోతాదులోనే ఎరువులు వినియోగించిన పంటలను పండించిన రైతులను గుర్తిస్తామన్నారు. పంట ఉత్పత్తులను రాష్ట్ర సేంద్రి య ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ తనిఖీ చేసిన తర్వాత ఇండిగ్యాప్ ధ్రువపత్రాలు అందచేస్తామన్నారు. ఈ ధ్రువపత్రం పొందిన రైతులు సేంద్రియ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవచ్చన్నారు. 2025–26లో జిల్లాలోని 24 మంది రైతులకు ఈ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. పంటలు సాగు చేసిన విస్తీర్ణం ఎంత ఉన్నప్పటికీ ఒక్కో రైతుకు యూనిట్ కాస్ట్ రూ.77,100 ఉందని, ఇందులో 50 శాతం అంటే రూ.38,500 ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 50 శాతం రైతు భరించాలన్నారు. జిల్లాలో ని రైతులు వీలైనంత త్వరగా ఇండిగ్యాప్ ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి తెలిపారు.


