దేశ రక్షణకు కమ్యూనిస్టుల ఐక్యత అవసరం
నంద్యాల(న్యూటౌన్): ‘భారత రాజ్యాంగాన్ని మనుస్మృతిగా మార్చాలని చూస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తుల పతనానికి కమ్యూనిస్టుల ఐక్యత పునాది కావాలి. నాడు స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారితో పోరాటం చేశాం.. నేడు దేశ రక్షణకు మతత్వ శక్తులపై పోరాడేందుకు నంద్యాల వేదికగా నాంది పలకాలి’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉన్న వివేకానంద ఆడిటోరియంలో ‘కమ్యూనిస్టుల ఐక్యత, నేటి ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టు ల బలిదానాల వల్లే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, రామాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ కలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో చంపడం హేయమైన చర్య అని ఖండించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ చేస్తూ తన సన్నిహితులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్, సీనియర్ నాయకులు శంకరయ్య, మనోహర్ మాణిక్యం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, భార్గవ్, రఘురామ్మూర్తి, నాగరాముడు, లక్ష్మిదేవి, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.


