మైనింగ్ లీజు రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం
ఎన్‌ఓసీ రద్దుకు ప్రతిపాదిస్తామన్న అధికారులు
ఆలూరు రూరల్: హత్తిబెళగల్ గ్రామ సమీపంలోని క్వార్ట్జ్ క్వారీ మైనింగ్ లీజు రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తామని ఆ గ్రామస్తులు మైనింగ్ అధికారులను హెచ్చరించారు. క్వారీ ఎన్‌ఓసీ రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఈ నెల 15వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు అర్జీ అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం గనుల, భూగర్భ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ హసీనాబాను ఆధ్వర్యంలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు క్వారీని పరిశీలించారు. అధికారుల రాక సమాచా రం తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని సమస్యను విన్నవించారు. 2018 ఆగస్టులో గ్రామ సమీపంలోని క్వారీలో పేలుడు సంభవించి 14 మంది చనిపోయారన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అప్పటి అధికారులు మైనింగ్‌ని నిలిపేశారన్నారు. ఏడేళ్ల తరువాత గ్రామ సమీపంలోని కొండల్లో పేలుళ్లు, తవ్వకాలు అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఈ ఏడాది జూలై నెలలో క్వారీ అనుమతులు రద్దు చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే మైనింగ్ అధికారులు వచ్చి పరిశీలన చేసి కొండలో తవ్వకాలు నిలిపివేశారని.. గత 20 రోజుల నుంచి ఆ క్వారీ ఇతర వ్యక్తులు లీజుకు తీసుకుని పనులు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. క్వారీకి 200 మీటర్ల సమీపంలో చరిత్ర కలిగిన పురాతన ఆంజనేయ స్వామి ఆలయం, ప్రభుత్వ పాఠశాల, నివాస గృహాలు ఉన్నాయన్నారు. ఇదే ప్రదేశంలో 8 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసి సంపు, ఓహెచ్‌ఆర్ ట్యాంక్ ఉందని.. అలాగే పంట పొలాలపై దుమ్ము, ధూళి చేరడంతో పంటలు నష్టపోతున్నాయన్నారు. వాతావారణ కాలుష్యంతో గ్రామ ప్రజలు అనార్యోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు సర్వే నంబర్ 969,969/సీలోని క్వారీ లీజు రద్దు చేస్తూ నివేదిక తయారీ చేసి ఆలూరు తహసీల్దార్, జిల్లా గనుల, భూగర్భ శాఖ ఉన్నతాఽధికారులకు సిఫారస్సు చేస్తామన్నారు. నేటి నుంచి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్వారీ పరిశీలనలో మైనింగ్ విజిలెన్స్ అధికారి సాంబశివారెడ్డి, వీఆర్వో అమరేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
గనుల, భూగర్భ శాఖ అధికారులను నిలదీసిన హత్తిబెళగల్ గ్రామస్తులు


