
గుంతలో దిగబడి..రేషన్ దందా పట్టుబడి
● పత్తి కొండ సమీపంలో రేషన్ బియ్యం లారీ పట్టివేత ● కర్ణాటకకు తరలిస్తుండగా గుంతలో దిగబడిపోయిన లారీ
పత్తికొండ: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అధికార పార్టీ నాయకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రహదారిపై పడిన గుంతలే మంగళవారం లారీ రేషన్ బియ్యాన్ని పట్టించాయి. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ పట్టణం నుంచి వెళ్లే ఆదోని రహదారి గుంతలమయంగా మారింది. ఎప్పటిలాగే ఈ దారిలో అక్రమార్కులు సేకరించిన రేషన్‌బియ్యాన్ని లారీలో కర్ణాటకకు తరలిస్తున్నారు. గోపాల్ ప్లాజా దగ్గర మొయిన్ రోడ్డు మార్గమధ్యలో టైరు గుంతలో ఇరుక్కుపోయి లారీ ఒరిగింది. ఆ సమయంలో బియ్యం కింద రాలడంలో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే ఆర్‌డీఓ భరత్‌నాయక్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఆయన సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిశీలించి లారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం పంచనామా కోసం రేషన్ బియ్యం నిల్వ ఉంచే స్టాకు పాయింట్ గోడౌన్‌కు పంపారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు 200 రేషన్ బియ్యం సంచులను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.