
కర్నూలు జిల్లా: తండ్రి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉద్యోగం తనకు కావాలంటూ కన్న కొడుకే రోకలిబండతో తలపై దారుణంగా కొట్టి హతమార్చిన ఘటన బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన రామాచారి (58) ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య విరుపాక్షమ్మతో పాటు, కుమారుడు వీరస్వామి, ఒక కుమార్తె సంతానం. రామాచారి పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. డిగ్రీ వరకు చదివిన వీరస్వామి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన అనంతరం గ్రామం చేరుకుని జులాయిగా తిరుగుతున్నాడు.
తండ్రి రామాచారి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉద్యోగం తనకిప్పించాలంటూ కొంతకాలంగా వీరస్వామి తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెలవారుజామున ఉద్యోగం విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుని రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. గమనించిన గ్రామస్తులు కోడుమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతుడి భార్య విరుపాక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.