
రైతులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం
కర్నూలు (టౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఆరోపించారు. ప్రభుత్వంలో చలనం తీసుకు వచ్చేందుకు ఈనెల 9న తమ పార్టీ అధ్వర్యంలో జిల్లాలొని అన్ని ఆర్డీఎ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ఆందోళనలు, నిరసన కార్యకార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కర్నూలులోని స్థానిక చిల్డ్రన్స్ పార్కు నుంచి రైతులతో కలిసి పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు మీదుగా ఆర్‌డీవో కార్యాలయానికి ప్రదర్శనగా వెళతామన్నారు.
వేల కోట్లు దోపీడీ..
రాష్ట్ర ప్రభుత్వం 16 నెలల వ్యవధిలో రూ. 2.09 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే రైతులకు ధరల స్టీరికరణ కోసం రూ.3 వేల కోట్ల కేటాయించలేదని ఎస్వీ విమర్శించారు. అమరావతికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారని ప్రశ్నించారు. రేషన్ బియ్యం, మద్యం, ఇసుక, మైనింగ్‌లలో వేల కోట్లు టీడీపీ నేతలు దోపీడీ చేస్తున్నారని ఆరోపించారు. రైతుల యూరియాను సైతం బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకుంటున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏనాడైనా రైతులు రోడ్ల మీదకు వచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయన్నారు. వైఎస్సార్‌సీపీ కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా రైతు సంక్షేమానికి పాటుపడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు షరీఫ్, జుబేర్, షేక్ అహమ్మద్, పాటిల్ హనుమంతరెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, కిషన్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉల్లి క్వింటా ధర రూ. 2,500 చేయాలి
ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలాలు లేవని ఎస్వీ విమర్శించారు. ఉల్లి రైతుల ఇబ్బందులు తెలిసి మార్కెట్ యార్డుకు వెళ్లి తాను పరామర్శించిన తర్వాత మార్కెట్ యార్డు ఆధికారులు, కలెక్టర్, మంత్రి మార్కెట్ యార్డును సందర్శించారన్నారు. ఉల్లి క్వింటా ధర రూ.1,200 ప్రకటించారని, దానిని రూ. 2,500 చేయాలన్నారు. యూరియా కోసం రైతులు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లను చేస్తోందని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి రాక ఉల్లి, పత్తి, టమాటా, మిర్చి, రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు.
మిర్చి, పత్తి, ఉల్లి పంటలకు
గిట్టుబాటు ధర లేదు
9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి