
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
కర్నూలు: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, అనుబంధ గోదాములను జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తనిఖీ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడుమూరు మండలం బైన్‌దొడ్డి గ్రామానికి చెందిన బోయ చిన్న వీరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు పోలీసులు స్థానిక శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి ఎరువుల సంచులు, బిల్లు బుక్కులను పరిశీలించారన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు తేలడంతో దుకాణ యజమాని పట్నం కృష్ణమూర్తిపై కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి చీటింగ్ కేసు నమోదు చేశారన్నారు. స్టాక్ వివరాలు రైతులకు అర్థమయ్యే రీతిలో నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పీఆర్ ఎస్‌ఈగా వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్‌గా ఐ.వేణుగోపాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను గౌరవపూర్వకంగా కలిశారు. గతంలో ఇక్కడ రెగ్యులర్ ఎస్‌ఈగా విధులు నిర్వహించిన వి.రామచంద్రారెడ్డి గత ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. ప్రకాశం జిల్లా ఈఈగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌కు ఎస్‌ఈగా పదోన్నతి కల్పించి కర్నూలుకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించారు.
ఖరీఫ్ సీజన్‌లో
సాగు తక్కువే!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంటల సాగులో పురోగతి కరువైంది. ముందస్తుగా వర్షాలు కురిసినప్పటికీ ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురిసినా సాగు తక్కువగానే ఉండటం గమనార్హం. ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 3.46 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 3.62 లక్షల హెక్టార్లలో సాగు కావడం విశేషం. ఽ 2024 ఖరీఫ్‌తో పోలిస్తే.. 2025లో సాగు భారీగా తగ్గడం ఆందోళన కలిగించే విషయం. గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల వేరుశనగ, మిర్చి, పొగాకు సాగు తగ్గింది. అత్యధికంగా పత్తి 2,19,636 హెక్టార్లలో సాగయింది. వేరుశనగ 28,453, ఉల్లి 11056, మిర్చి 5546, టమాట 1767, కంది 39531. ఆముదం 9306, సజ్జ 5749. మొక్కజొన్న 7201, కొర్ర 2858 హెక్టార్లలో సాగు చేశారు.
ఇద్దరు సీఐలకు పదోన్నతి
కర్నూలు(టౌన్): కర్నూలు రేంజ్ పరిధిలో ఇద్దరు సీఐలకు పదోన్నతి లభించింది. ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సీఐగా పనిచేస్తున్న బీవీ మధుసూదన్ రావు, అలాగే మరో సీఐ బి.వి.శ్రీనివాసులుకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు