
మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
కర్నూలు: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులు, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అత్యుత్సాహం ప్రదర్శించవద్దని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసులకు సూచించారు. కర్నూలులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయ పెరేడ్ మైదానంలో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ తర్వాత గణేష్ నిమజ్జనం కర్నూలులోనే అత్యంత ప్రాధాన్యతగా జరుగుతుందన్నారు. విధుల పట్ల ఎవరూ అలసత్వం ప్రదర్శించకుండా కార్యక్రమం పూర్తిగా ముగిసే వరకు కేటాయించిన స్థానాల్లోనే ఉండాలన్నారు. కేసీ కెనాల్, వినాయక ఘాట్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు మత పెద్దలు, రాజకీయ పార్టీలు, యువకులు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.