
వీధి కుక్కల దాడిలో 12 మంది గాయాలు
పత్తికొండ: వీధి కుక్కల దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన చాకలి అయ్యమ్మ అనే మహిళ పని నిమి త్తం పత్తికొండకు వచ్చారు. ఆమెతోపాటు మరో 11 మంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడే ఉన్న వీధి కుక్కలు దాడి చేశాయి. అక్కడ ఉన్న స్థానికులు గమనించి కుక్కలను తరిమారు. గాయపడిన వారిని వైద్య చికిత్సల నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పత్తికొండ పట్టణంలోని అన్ని కాలనీల్లో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని వాటిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మోటార్ల దొంగలను వెంటాడి పట్టుకున్న రైతు
ఆత్మకూరురూరల్: మోటార్ల దొంగలను వెంటాడి పట్టుకున్న ఘటన ఆత్మకూరు మండలంలోని సిద్దపల్లె – పెద్దనంతాపురం మద్య గురువారం రాత్రి జరిగింది. ముష్టపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు శివాజి నాయక్ సిద్దాపురం చెరువు ఎడమ కాల్వ నీటిపై ఆధారపడి పొలం సాగు చేసుకుంటున్నాడు. పొలంలో మోటార్‌ను తస్కరించి దొంగలు ద్విచక్రవాహనంపై పారిపోతుండగా రైతు శివాజీ నాయక్ తన మోటార్ సైకిల్‌ను అడ్డుగా నిలిపి వారిని పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడింది సిద్దపల్లె గ్రామానికి చెందిన సుబ్బారాయుడు, మధుగా గుర్తించారు. చుట్టు పక్కల రైతులు వీరిద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మోటార్ల దొంగలపై ఎలాంటి కేసులేకుండా వదలి వేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
47 మంది ఆసుపత్రి పాలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో గురు, శుక్రవారాల్లో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో అస్వస్థతకు గురై 47 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో బైక్ ప్రమాదాలు, వివిధ రకాల రోడ్డు ప్రమాదాలు, తోపులాటలో కింద పడటం, వాహనాలపై నుంచి పొరపాటుగా కిందపడటం, ఘర్షణల్లో గాయపడటం వంటివి ఉన్నాయి. వీరంతా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీకి వచ్చి చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలు జరిగి అధిక సంఖ్యలో క్షతగాత్రులు వస్తారన్న ఉద్దేశంతో ఆసుపత్రి అధికారులు ఎక్కువ మంది వైద్యులు, సిబ్బందిని క్యాజువాలిటీలో ఉంచారు. ఈ మేరకు వచ్చిన వారికి వచ్చినట్లు ప్రథమ చికిత్స అందించి పంపించారు. 45 మంది ఓపీ డిశ్చార్జ్ కాగా ఒకరికి ఫ్యాక్షర్ కావడంతో అడ్మిట్ చేశారు. ఒకరు కత్తిపోట్లకు గురికావడంతో అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించారు.