
ప్రారంభించరు.. పెళ్లిళ్లు జరగవు
డోన్: సన్నాయి రాగాలు.. మేళ తాళాలు.. వేద పండితుల పెళ్లి మంత్రాలు వినిపించాల్సిన ఆ కల్యాణ మండపాల్లో నిశబ్దం అలుముకుంది. వివాహాలతో కళకళలాడాల్సిన ఆ భవనాలు కూటమి నేతల పచ్చపాత పాలనతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డోన్ నియోజకవర్గంలో నిర్మించిన రెండు తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపాలు రెండేళ్లయినా దేవదాయ, ధర్మదాయ శాఖ స్వాధీనం చేసుకోకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. దీంతో సుమారు రూ.8.50 కోట్లతో నిర్మించిన మండపాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నియోజకవర్గ కేంద్రం డోన్‌తో పాటు మండలంలోని ప్రసిద్ధ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రజల సౌకర్యార్థం కల్యాణ మండపాలను నిర్మించింది. వీటిని ప్రారంభిస్తే మంజూరుకు విశేష కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మరింత పేరు వస్తుందనే దురుద్దేశంతో కూటమి నేతలు అడ్టు తగులుతున్నారు. టీటీడీ నుంచి ఈ మండపాలను దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోకుండా పచ్చ పార్టీ నేతలు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే ఓ సంఘటన చోటు చేసుకుంది. గత టీడీపీ పాలనలో 2014 –19 మధ్యలో నియోజకవర్గానికి టీటీడీ కల్యాణ మండపాలు మంజూరైనా అప్పటి దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణ అడ్డుకున్నారు. ఆ సమయంలో డోన్ నుంచి బుగ్గన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటం కారణమని అప్పట్లో చర్చ జరిగింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గం అభివృద్థి పథంలో ఉరకలు వేసింది. ఊరూరా రహదారులు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపడం, ప్రభుత్వ విద్యాసంస్థలు మంజూరు కావడం జరిగింది. ఈ క్రమంలోనే డోన్, ఎస్. గుండాలలో కల్యాణ మండపాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుండాల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో రూ.3 కోట్లతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీటీడీ పాలక మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డితో కలిసి కల్యాణ మండప నిర్మాణం ప్రారంభించారు. అలాగే డోన్ శివారులో కర్నూలుకు వెళ్లే 44వ జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపం కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
ఆధునిక వసతులతో నిర్మాణం
రెండు కల్యాణ మండపాలలో సుమారు వెయ్యి మంది కూర్చునేందుకు సువిశాలమైన హాలుతో పాటు పెళ్లికూతురు, పెళ్లికుమారుడికి విడిది గదులు, 10 నుంచి 20 మందికి సరిపడే సూట్లు, ఆధునిక వసతులతో కిచెన్, టాయ్‌లెట్స్, ముందు భాగం సువిశాలమైన పార్కింగ్ స్థలం, గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ కల్యాణ మండపాలను టీటీడీ అధికారులు అప్పగించేందుకు ముందుకు వస్తున్నా దేవదాయ శాఖ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి స్వాధీనం చేసుకునేందుకు వెనకడుగు వేస్తోంది.
నిరుపయోగంగా రెండు
టీటీడీ కల్యాణ మండపాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
రూ. 8.50 కోట్లతో నిర్మాణం
ప్రారంభించేందుకు అడ్డుతగులుతున్న
కూటమి ప్రభుత్వం
పాలకులపై ఆగ్రహం
వ్యక్తం చేస్తున్న ప్రజలు

ప్రారంభించరు.. పెళ్లిళ్లు జరగవు

ప్రారంభించరు.. పెళ్లిళ్లు జరగవు