
ఐక్యతకు ప్రతీక గణేష్ మహోత్సవాలు
కర్నూలు కల్చరల్: గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రతీక గా నిలుస్తున్నాయని, సంఘటితంగా ప్రశాంత వాతా వరణంలో జరుపుకుందామని శ్రీగణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. మంగళవారం వినాయక్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడు, ఐదు రోజుల్లో వినాయక నిమజ్జనం విజయవంతమైందన్నారు. ఈనెల 4వ తేదీన కర్నూలు నగరంలో ఉద యం 9 గంటలకు ఓల్డ్‌సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద నుంచి వినాయక నిమజ్జన మహోత్సవ శోభాయా త్ర ప్రారంభమవుతుందన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం రెండు విగ్రహాలతో ప్రారంభమైన ఉత్సవాలు క్రమంగా 2,200 విగ్రహాలకు చేరుకున్నాయన్నారు.
● ఉత్సవ సమితి జిల్లా సంఘటనా కార్యదర్శి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్‌కు ఉత్సవాలను అంకితమిస్తున్నామన్నారు. ఎలాంటి అసాంఘిక, అశ్లీలతకు తావులేకుండా సంప్రదాయ బద్ధంగా వినాయక శోభాయాత్రను, నిమజ్జన వేడుకను జరుపుకుందామన్నారు. రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా గంగాహారతి ఉంటుందన్నారు.
● సమితి నగర అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ కేంద్ర సమితి సూచనలు పాటించి ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వినాయక ఘాట్‌లో నిమజ్జనం ప్రారంభ మవుతుందన్నారు. మొత్తం 8 ఘాట్లలో 10 క్రేన్లతో 2వేల మంది వలంటీర్లతో నిజమ్జన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సహ కార్యవాహ ఎం.శ్రీనివాసరెడ్డి సందేశమిస్తారన్నారు.
● సమావేశంలో ఉత్సవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంట్ల రమణ, నగర ప్రధాన కార్యదర్శి సీవీ గిరిరాజవర్మ, నగర ఉపాధ్యక్షులు కాశీవిశ్వనాథ్, సమన్వయ కార్యదర్శి బాను ప్రకాష్, ప్రచార ప్రముఖ్ అక్కెం విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.